నిరాహార దీక్ష విరమింపజేసిన డీసీసీ అధ్యక్షుడు రామకృష్ణ..

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం జరుగుతుందని నగర కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తెలిపారు. పార్టీ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యం తప్పకుండా లభిస్తుందని అన్నారు.

మాజీ మేయర్ ధర్మపురి సంజయ్‌కు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలతో ఆయన అభిమానులు గాంధీ చౌక్‌లో చేపట్టిన నిరాహార దీక్షను రామకృష్ణ సందర్శించి, వారితో మాట్లాడి దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుందనే భావన సరైంది కాదన్నారు. నిజామాబాద్ నగర డీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇవ్వడం, రాష్ట్ర స్థాయిలో రాంభూపాల్‌కు ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం, ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో 10 కార్పొరేటర్ స్థానాలు మున్నూరు కాపులకు కేటాయించడం వంటి ఉదాహరణలు ఇచ్చారు.

అలాగే, రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులతో పాటు నామినేటెడ్ పోస్టులు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ వంటి కీలక పదవులు కూడా మున్నూరు కాపులకు ఇవ్వబడినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా అవసరాన్ని బట్టి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీకి అనుగుణంగా కలిసికట్టుగా పనిచేయాలని, వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు సాగుతూ, రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply