దొంగల ధర్మారంలో క్రికెట్ టోర్నీ..
నార్సింగి, ఆంధ్రప్రభ ; నార్సింగి మండలం భీమ్రావుపల్లి గ్రామ యువత క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ చాటుతూ ద్వితీయ స్థానం సాధించింది. రామయంపేట్ మండలం దొంగల ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా నిర్వహించిన ఈ పోటీల్లో మెదక్ జిల్లాకు చెందిన 54 గ్రామాల జట్లు పాల్గొన్నాయి.
ఈ పోటీల్లో భీమ్రావుపల్లి గ్రామానికి చెందిన యువజట్టు కెప్టెన్ టి. నవీన్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్ వరకు దూసుకెళ్లి రెండో స్థానాన్ని (సెకండ్ కప్) కైవసం చేసుకుంది. యువత కష్టపడి ఆడి ఈ స్థాయి విజయాన్ని సాధించడం గ్రామానికి గర్వకారణమని మాజీ వార్డు సభ్యుడు బోయిని భూషణం తెలిపారు.
జట్టు సభ్యుల ప్రతిభను గ్రామస్తులు, సర్పంచ్, వార్డు సభ్యులు అభినందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ముందు ఈ యువత జిల్లా, రాష్ట్ర స్థాయిలో కూడా రాణించాలని ఆకాంక్షిస్తూ గ్రామ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు.
