Cricket | ఐపీఎల్లో భారత ఆటగాళ్ల హవా..
Cricket | ఐపీఎల్లో భారత ఆటగాళ్ల హవా..
Cricket | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్‌లో భారత్, విదేశీ ఆటగాళ్ల సమ్మేళనంతో జట్లు ఉంటాయి. ఈ జట్లకు ఎవరైనా కెప్టెన్సీ చేయవచ్చు. అది భారత ఆటగాళ్లు కావొచ్చు, విదేశీ ప్లేయర్ కావొచ్చు. ప్రతీ సీజన్‌లో ఏదో ఒక జట్టుకు విదేశీ ఆటగాడు కెప్టెన్‌గా వ్యవహరించేవారు. కానీ ఈ సారి ఆ ఒరవడి మారింది. లీగ్‌లో ఆడుతున్న పది జట్లకూ భారత ఆటగాళ్లే సారథ్యం వహిస్తున్నారు.
సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ గాయపడటంతో తాత్కాలిక సారథిగా ఇషాన్‌ను నియమించారు. అలాగే రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంతో సంజు శాంసన్ ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. అతను చెన్నై సూపర్‌కింగ్స్‌కు వెళ్లిపోవడంతో పరాగ్‌కు బాధ్యతలు అప్పగించింది యాజమాన్యం. ముంబై జట్టుకు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా ఉన్నాడు. రోహిత్ శర్మను తప్పించి సారథ్య బాధ్యతలు హార్దిక్‌కు ఇచ్చారు. దీనిని అప్పట్లో అభిమానులు తీవ్రగా వ్యతిరేకించారు.
గత సీజన్‌లో బెంగళూర్ జట్టకు కప్ బెంగ తీర్చాడు రజత్ పటీదార్. తన సారథ్యంలో ఆర్సీబీ 13 మ్యాచ్‌లు ఆడి, మూడు మాత్రమే ఓడింది. 10 విజయాలతో కప్పును సొంతం చేసుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను రెండేళ్లుగా రుతురాజ్ గైక్వాడ్ నడిపిస్తున్నాడు. కానీ అతను ఎంఎస్ వారసత్వాన్ని నిలబెట్టలేకపోతున్నాడు. బ్యాటర్‌గా రాణిస్తున్నప్పటికీ.. సారథిగా ప్రభావం చూపలేకపోతున్నాడు. గత ఏడాది గాయం కారణంగా టోర్నీ నుంచి రుతురాజ్ అర్ధంతరంగా తప్పుకొంటే ధోనీనే మిగతా సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసారి మళ్లీ జట్టు పగ్గాలు అందుకుంటున్నాడు రుతురాజ్.
నిరుడు శ్రేయస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్. శ్రేయస్ గత సీజన్‌లో ఈ జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈసారి పంజాబ్ కప్పు కలను నెరవేర్చాలని చూస్తున్నాడు శ్రేయస్. రెండేళ్లుగా గుజరాత్ జట్టును శుభ్‌మన్ గిల్ నడిపిస్తున్నాడు. ఇతని సారథ్యంలో నిరుడు మెరుగైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో అతను 14 విజయాలందుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన కెప్టెన్ అజింక్య రహానేనే. 37 ఏళ్ల అతను కేకేఆర్‌కు కెప్టెన్. కానీ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. ఈసారి ఆ జట్టు బలం పెంచుకుంది.
లఖ్‌నవూకు రిషబ్ పంత్.. ఢిల్లీకి అక్షర్ పటేల్ కెప్టెన్లుగా ఉన్నారు. వీరి కెప్టెన్సీలో గత సీజన్‌లో ఈ జట్లు సాధారణ ప్రదర్శన చేశాయి. ఈసారి ఏం చేస్తారో చూడాలి.
