- ఫైనల్లో లీ షీ చేతిలో ఓటమి
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిబాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు. టోర్నమెంట్ ఆరంభం నుంచి పురుషుల సింగిల్స్‌లో వరుస విజయాలతో అద్భుత ప్రదర్శనలు చేసిన తెలుగు తేజం శ్రీకాంత్ తుది మెట్టుపై మాత్రం బోల్తపడ్డాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాజీ వరల్డ్ నం.1 కిదాంబి శ్రీకాంత్ 11-21, 9-21 తేడాతో చైనీస్ టాప్ షట్లర్, ప్రపంచ 4వ ర్యాంకర్ లీ షి ఫెంగ్ చేతిలో వరుస గేముల్లో ఓడిపోయాడు. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన చైనా స్టార్ 39 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించి టైటిల్ కైవసం చేసుకున్నాడు.
కాగా, దాదాపు ఆరేళ్ల తర్వాత ఓ సూపర్ సిరీస్ టోర్నీ ఫైనల్లో ప్రవేశించిన భారత స్టార్ కిదాంబికి ఆఖరి మెట్టుపై భారీ నిరాశా ఎదురైంది. ఇక ఈ టైటిల్ పోరులో ఓడినప్పటికీ ఓవరాల్‌గా మాత్రం శ్రీకాంత్ ప్రదర్శన ఈ టోర్నీలో అద్భుతంగా సాగింది. ముందు రెండు క్వాలఫయర్స్ మ్యాచ్‌లను నెగ్గి కిదాంబి మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు.
అక్కడ కూడా తన వరుస విజయాల పరంపర కొనసాగిస్తూ తుది పోరుకు దూసుకెళ్లాడు. ఈ టోర్నీకి ముందు శ్రీకాంత్ 2019లో చివరిసారి ఇండియా ఓపెన్‌లో ఫైనల్లో ప్రవేశించాడు. ఇక గత కొన్నేళ్లుగా గాయాలు, ఫామ్‌లేమి సమస్యలతో మేజర్ ఈవెంట్లలో మెరుగైన ప్రదర్శనలు చేయలేక పోయాడు. కానీ, ఎట్టకేలకు ఇప్పుడు మాజీ వరల్డ్ నం.1 మళ్లి ఫామ్‌ను అందుకోవడం భారత ఫ్యాన్స్‌లో కొత్త ఉత్తేజాన్ని నింపింది.