మహిళా సాధికారతకు గుర్తింపు
ప్రశంస అవార్డు అందుకున్న లక్షట్‌పేట సర్పంచ్ కోట్నాక్ వనిత
ఉట్నూర్, ఆంధ్రప్రభ: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఇండియా గ్రాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని లక్షట్‌పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట్నాక్ వనిత భగవంత్‌రావుకు ప్రశంస అవార్డు లభించింది.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న కోట్నాక్ వనిత భగవంత్‌రావు, వేట ఫౌండేషన్ చైర్మన్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రశంస అవార్డును అందుకున్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే అశ్విని రెడ్డి సమక్షంలో ఈ అవార్డును స్వీకరించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సాధికారత కోసం వేట ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలను నిర్వాహకులు వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి వివరించారు.
అవార్డు అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సర్పంచ్ కోట్నాక్ వనిత భగవంత్‌రావు, మహిళల అభ్యున్నతి కోసం మరింత కృషి చేస్తానని తెలిపారు.
