ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించారు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ.. ఒకేసారి రెండు అరుదైన మైలురాళ్లను అందుకుని క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్‌గా 5,500+ పరుగులు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ కేవలం 7 పరుగులు పూర్తి చేయగానే ఒక అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్‌గా 5,500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి దిగ్గజాలు ఓపెనర్లుగా ఈ మార్క్‌ను అందుకున్నప్పటికీ.. వారు వేర్వేరు జట్ల తరపున ఆడి ఈ ఘనత సాధించారు.
ఈ రికార్డుతో పాటు ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కోహ్లీ మరో సంచలన ఘనతను సాధించారు. ఈ సీజన్‌లో 500 పరుగుల మార్కును దాటడం ద్వారా.. ఐపీఎల్ చరిత్రలో 9 విభిన్న సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర లిఖించారు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్ (7 సీజన్లు), కేఎల్ రాహుల్ (7 సీజన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
