జాతీయస్థాయి క్రికెట్‌కు కానిస్టేబుల్ కుమారుడు..
పుట్టపర్తి క్రైమ్, ఆంధ్రప్రభ : శ్రీ సత్య సాయి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న షేక్ దాదా పీర్ కుమారుడు షేక్ మహమ్మద్ తన్వీర్ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటుకుని జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. కానిస్టేబుల్ దాదా పీర్ స్వగ్రామం కళ్యాణదుర్గం పేరును తన కుమారుడు తన్వీర్ జాతీయస్థాయికి తీసుకెళ్లాడు.
రాష్ట్రస్థాయిలో రాణించి జాతీయస్థాయికి ఎంపిక కావడంలో తన తండ్రి ప్రోత్సాహం, కోచ్‌లు దాదా ఖలందర్, హరి, అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ క్రికెట్ అకాడమీ శిక్షణ ఎంతో తోడ్పడిందని తన్వీర్ తెలిపారు. క్రికెట్‌లో మరింత రాణించి దేశ ప్రతిష్టను పెంచేలా కృషి చేస్తానని అన్నారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తన్వీర్‌కు అభినందనలు తెలియజేసి, మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుకు మొహిద్దీన్ ఎంపిక..
విజయవాడ : ఆల్ ఇండియా యూనివర్సిటీ క్రికెట్ జట్టు కోసం ఎంపికైన కృష్ణా జిల్లాకు చెందిన వికెట్ కీపర్–బ్యాట్స్‌మన్ ఖాజా మొహిద్దీన్కు కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కెడిసిఎ) సెక్రటరీ ఎం. రవీంద్ర చౌదరి బుధవారం పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఇందిరా గాంధీ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా క్రికెట్ ఆటగాళ్ల సమక్షంలో మొహిద్దీన్‌ను సన్మానించారు. డిసెంబర్ 7 నుంచి 19 వరకు ఆస్ట్రేలియాలో జరగనున్న ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లో ఆల్ ఇండియా యూనివర్సిటీ జట్టు తరపున ఖాజా మొహిద్దీన్ పాల్గొననున్నాడు. ఈ సిరీస్‌లో ఆల్ ఇండియా యూనివర్సిటీ జట్టు, ఆల్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ క్రికెట్ జట్టుతో తలపడనుంది.
ఖాజా మొహిద్దీన్ గతంలో వినూ మాంకడ్ ట్రోఫీలో జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించాడని, అనంతరం ఆలిండియా ఇంటర్వర్సిటీ సెలెక్షన్ ట్రయల్స్‌లో అర్హత సాధించి జట్టులో స్థానం దక్కించుకున్నాడని రవీంద్ర చౌదరి తెలిపారు.
