Telangana Identity | తెలంగాణ ముమ్మాటికీ ఆ భూమిపుత్రులదే…

Telangana Identity | తెలంగాణ ముమ్మాటికీ ఆ భూమిపుత్రులదే…

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మ‌రో సారి తెలంగాణ ప్రాంతంపై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఆ ప్రాంత ప్రజలదేనని, వారి హక్కులు, ప్రాధాన్యతలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో “తెలంగాణ మీ జాగీరా?” అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పోటీ చేసే అంశంపై ప్రస్తుతం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేవన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని సూచించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు సోదరుడు లాంటి వారని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని అభిప్రాయపడ్డారు. అలాగే ఈ వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందని తాను అనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు పనిగట్టుకుని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. “రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ వెళ్లి పోటీ చేయొచ్చు. కానీ మేము వస్తే బెదిరిస్తారా?” అంటూ ప్రశ్నించిన పవన్.. ప్రజలను కలపడానికి వచ్చామని, విడదీయడానికి కాదని స్పష్టం చేశారు.

ఏపీ నుంచి వెళ్లి తెలంగాణలో ఎవరూ పోటీ చేయడం లేదని, జనసేనలోని తెలంగాణ భూమిపుత్రులే అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికీ తెలంగాణ ఉనికి, ఆత్మగౌరవ భావన బలంగానే ఉందన్నారు. మా తెలంగాణ నేతలు పోరుపెడితేనే అక్కడికి వెళ్లిన‌ట్టు తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పుష్కరకాలం దాటినా ఇంకా అంత ద్వేషం ఉంటుందని ఊహించలేదు అని ప‌వ‌న్ అన్నారు.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర గుర్తింపు కంటే కుల రాజకీయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పవన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రా అనే భావ‌న‌కంటే.. కుల భావ‌న‌లే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే కులం పేరుతో దూషించే పరిస్థితి ఏర్పడింది అని ఆందోళన వ్యక్తం చేశారు.

కుల విద్వేషాలకు ముగింపు పలకాలని జనసేన నిర్ణయించిందని, అందుకోసం “సేనాగళం” పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలో ఎక్కడైనా జీవించడం ప్రతి భారతీయుడి హక్కు అని, ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదన్నారు.

Leave a Reply