కాంగ్రెస్ ప్రభుత్వానివి ప్రతీకార పాలిటిక్స్‌

కంది జైలులో క్రిషాంక్‌ను పరామర్శించిన కేటీఆర్

అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే క్రిశాంక్ పై కేసులు
అక్రమ కేసులతో బీఆర్ఎస్ నేతలపై వేధింపులు
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

సంగారెడ్డి ప్రతినిధి, మే 4 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ ప్రభుత్వానివి ప్రతీకార రాజకీయాలని, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే క్రిశాంక్ పై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జైలులో అక్రమ కేసుల్లో నిర్బంధంలో ఉన్న పార్టీ నాయకుడు మన్నె క్రిషాంక్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలతో బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తోందని తీవ్రంగా ఆరోపించారు. మన్నె క్రిషాంక్ చదువుకున్న యువకుడు, న్యాయవాది, పీహెచ్‌డీ పట్టాదారుడని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఎస్ఎండీసీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు.

అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందుకే..
రెండున్నర సంవత్సరాలుగా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెస్తున్నందుకే క్రిషాంక్‌పై వరుసగా కేసులు నమోదు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. నాలుగేళ్ల కంటే తక్కువ శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన పరిస్థితిలో, 12 రోజులుగా జైలులో ఉంచి ‘హ్యాబిచువల్ అఫెండర్’గా చూపించడం దుర్మార్గమని విమర్శించారు. క్రిషాంక్‌పై సుమారు 35 కేసులు నమోదు చేశారని పేర్కొంటూ, మిస్ ఇంగ్లాండ్ ఘటనపై సోషల్ మీడియాలో స్పందించినందుకు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, బినామీ కంపెనీల అంశాలను ప్రస్తావించినందుకు, కాంట్రాక్టుల కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు వెలుగులోకి తెచ్చినందుకు, గ్రామీణ సమస్యలను ప్రశ్నించినందుకు కేసులు పెట్టారని విమర్శించారు.

నేరాలపై దృష్టి పెట్టకుండా, సోషల్ మీడియా పోస్టులపై కేసులా?
రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలపై ప్రభుత్వం దృష్టి సారించకుండా, సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేయడంలోనే నిమగ్నమైందని కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్‌లో పగటిపూట కాల్పులు జరిగినా స్పందించలేదని, కానీ ట్వీట్లపై మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటోందని అన్నారు.పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు ముఖ్యమంత్రి ప్రైవేట్ ఆర్మీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, హ్యాకింగ్, జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోరా
హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా క్రిషాంక్‌ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ, దీనిపై కోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ మాట్లాడుతూ, “మా నాయకులను వేధించినా వెనక్కి తగ్గం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు ధైర్యం చెబుతూ, ఎవరూ భయపడవద్దని, పార్టీ లీగల్ సెల్ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ అక్రమాలను బయటపెడుతున్న మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు, నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.