హైదరాబాద్ లోని చందానగర్ లో ఉన్న గంగారం పెద్దచెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. పెద్దచెరువులో 5ఎకరాలు కబ్జాకు గురైందంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెరువును పరిశీలించారు కమిషనర్ రంగనాథ్. ఈ క్రమంలో చెరువు ఆక్రమణపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో చందానగర్ కార్పొరేటర్ మంజుల, హైడ్రా అధికారులు, ప్లాట్ ఓనర్లున్నారు. గంగరాం చెరువులో డంపింగ్ జరుగుతున్నా.. హైడ్రా కట్టడి చేయలేకపోతోందని స్థానిక శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. గంగారం చెరువులో డంపింగ్ ఎవరు చేస్తున్నారు..? డంపింగ్ చేసిన వారిపై కేసులు పెట్టారా..? తదితర వివరాలను స్థానిక ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తర్వాత మీడియాతో కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ, 2023 డిసెంబరులో డంపింగ్ చేసిన వారిపై ఇరిగేషన్ అధికారులు కేసులు పెట్టగా.. తాజాగా హైడ్రా డీఆర్ ఎఫ్ లేక్ ప్రొటెక్షన్ గార్డులు కూడా చందానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని కమిషనర్ చెప్పారు.
చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జాలు ఆగాలంటే.. హైడ్రా పోలీసు స్టేషన్ అవసరమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావించారని, ఈ పోలీస్ స్టేషన్ త్వరలోనే ప్రారంభమౌతుందన్నారు. డంపింగ్‌ను ఆపడానికి హైడ్రా పోలీసు స్టేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వాహనాలను, డ్రైవర్లను అరెస్టు చేయడం కాదని, వాటి మూలాలను తెలుసుకుని వారిపై కేసులు పెట్టాల్సినవసరం ఉందన్నారు.
హైడ్రా పోలీసు స్టేషన్ వచ్చేవరకూ స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెడతామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువుల్లో డంపింగ్ జరగకుండా చూస్తామన్నారు. ప్రతి చెరువు దగ్గర హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీ గార్డులుంటారని 24 గంటలూ తనిఖీలుంటాయని చెప్పారు. అనంతరం అయ్యప్ప సొసైటీ – బొరబండకి చేరువలో వున్న సున్నం చెరువును కూడా హైడ్రా కమిషనర్ సందర్శించారు. అక్కడ చెరువు పునరుద్ధరణ పనులకు ఆటంకాలపై సమీక్షించారు. వచ్చే వర్షాకాలానికి చెరువు అభివృద్ధి పనులు పూర్తి కావాలని అధికారులకు సూచించారు.