Agricultural Market Corruption | దళారుల చేతిలో రైతాంగం బలి

Agricultural Market Corruption | దళారుల చేతిలో రైతాంగం బలి

Agricultural Market Corruption | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లు దోపిడీ యార్డులుగా మారుతున్నాయి. ఇప్పటికే దళారీ వ్యవస్థతో ఇబ్బందులు పడుతున్న రైతులకు తాజాగా ఎదురవుతున్న సమస్యలు మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టు మారుతున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధరతో కొనే నాథుడు లేక అవస్థలు పడుతుంటే, పంట కొన్న వ్యాపారులు డబ్బులు ఎగ్గొట్టి పరారవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

ఆసియాలోనే అతిపెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మూడేళ్లుగా పాలకవర్గం లేకపోవడంతో పరిస్థితి పట్టుతప్పింది. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి వారే పట్టుసాధించేందుకు ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పాలకవర్గ నియామకాన్ని నిలిపివేసింది. ఈ సమస్యతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఆ వ్యవసాయ మార్కెట్‌కు పాలకవర్గాన్ని నియమించలేకపోయింది. ఫలితంగా అక్కడ అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువుదోపిడీ చేస్తుంటే, కొందరు వ్యాపారులు ఐపీ పెట్టి పారిపోతున్నారు.

ఆధిపత్య పోరులో రైతు ఆగం

మార్కెట్ యార్డు ప్రధానంగా చైర్మన్ పదవి కోసం మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎవరికి వారే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఏమీ తేల్చుకోలేక మార్కెట్ పాలకవర్గ నియామకాన్ని వాయిదా వేయడంతో పాలన గాడి తప్పింది.

2023 జులై నెలతో గత పాలకవర్గం గడువు ముగిసింది. దీనిపై ఆశలు పెట్టుకున్న నేతలు తమకు అనుకూలురైన పేర్లను మార్కెట్ చైర్మన్ కోసం ప్రతిపాదించారు. అప్పటికే ఓ కమిటీని నియమించిన సర్కారు దానిని బయటపెట్టకుండానే ఈ పోరు భరించలేక మిన్నకుండిపోయింది.

దోపిడీ యార్డులు!

వ్యవసాయ మార్కెట్ కమిటీ
వరంగల్ వ్యవసాయ మార్కెట్.. ఇప్పుడు పాలకవర్గం లేకపోవడంతో అధికారులు, దళారులు కుమ్మక్కై రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఈ మార్కెట్‌కు నిత్యం లక్షలాది మంది రైతులు పంటను తీసుకొస్తుంటారు. కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. ధరలు, సౌకర్యాలు, తూకాల్లో మోసాలపై నిత్యం రైతులు ఆందోళనలు చేస్తున్నారు.

ఇటీవలే ఓ వ్యాపారి రూ.2.5 కోట్ల రూపాయలకు ఐపీ పెట్టడం సంచలనంగా మారింది. ఇప్పటికీ అతడిపై చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో అతడికి సరుకు ఇచ్చి మోసపోయిన అడ్డీ వ్యాపారులు మార్కెట్‌ను స్తంభింపజేశారు. మిర్చి కొనుగోళ్లు నిలిపివేసి ఆందోళనలు చేపట్టారు. అయినా ప్రభుత్వ పెద్దలు స్పందించలేదు. ఇదిలా ఉండగా తాజాగా మరో వ్యాపారి రూ.3 కోట్లకు ఐపీ పెట్టి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

గాడితప్పిన పాలన

పాలకవర్గం లేకపోవడంతో దళారులదే రాజ్యమైంది. వారు చెప్పిన రేటుకే రైతులు తమ పంటను అమ్ముకోవాల్సి వస్తోంది. దీనివల్ల మూడేళ్ల నుంచి మార్కెట్ ఆదాయం ఏటా తగ్గిపోతోంది. మూడేళ్ల క్రితం రూ.50 కోట్ల ఆదాయం ఉంటే, అది ఇప్పుడు రూ.36 కోట్లకు పడిపోయినట్లు సమాచారం.

తగినంత మంది ఉద్యోగులు లేకపోవడం, పన్ను వసూళ్లపై దృష్టి సారించకపోవడం.. నలుగురు చేసే పని ఒకే ఉద్యోగిపై పడడంతో ఈ దుస్థితి ఏర్పడుతోంది. నలభై ఏళ్ల నుంచి మార్కెట్‌లో ఉద్యోగాలను భర్తీ చేయలేదు. కారుణ్య నియామకాలు మినహా కొత్తగా భర్తీ లేదు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు పంతానికి పోకుండా సమష్టి నిర్ణయంతో ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కొత్త పాలకవర్గం నియమించేలా దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply