తూడుకుర్తిలో పనుల వేగం పెంచాలి..

నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నిర్మాణ ప్రదేశాన్ని ఆకస్మికంగా సందర్శించి పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ …పాఠశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, వచ్చే విద్యా సంవత్సరం జూన్‌లో అకాడమిక్ కార్యకలాపాలు ప్రారంభమయ్యే నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ వెల్లడించారు.

ఈ పాఠశాలలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అందువల్ల నిర్మాణ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు సమయానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.

తరగతి గదులు ఆధునిక సౌకర్యాలతో నిర్మించడంతో పాటు, విద్యార్థుల కోసం విశాలమైన డార్మిటరీలు, సక్రమమైన గాలి, వెలుతురు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎంట్రన్స్ గ్రౌండ్, క్రికెట్ మైదానం, ఇతర ఆట స్థలాలు, త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య వసతులు వంటి అన్ని అంశాలను నాణ్యతతో నిర్మించాలన్నారు.

పనులు వేగంగా పూర్తి చేయడమే కాకుండా, నిర్మాణంలో ఎటువంటి రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తరువాత విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని, ఇది జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.