ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి
- ఎమ్మెల్సీ కోదండరాంకు ‘టీయూవీ’ వినతి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వం అన్ని విధాలా న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక జిల్లా జాయింట్ సెక్రెటరీ విజ్జిగిరి రాజేందర్ కోరారు. మంచిర్యాలకు వచ్చిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను ఆదివారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. నాడు చదువులు, వృత్తులను త్యాగం చేసి రైలు రోకోలు, వంటా-వార్పు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉచిత విద్యా, వైద్య సౌకర్యాలు కల్పించాలన్నారు. అలాగే నెలకు రూ.25 వేల పెన్షన్, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు, రైలు పాసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 17న రవీంద్రభారతిలో మహాసభ..
టీయూవీ రాష్ట్ర చైర్మన్ నరాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ నెల 17న (శుక్రవారం) హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉద్యమకారుల మహాసమావేశం, సన్మాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఇందులో జయశంకర్, గద్దర్ అవార్డుల ప్రదానంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కళాబృందం అధ్యక్షుడు కొప్పర్తి సురేందర్, జంపాల రవీందర్, గుడిసెల కృష్ణ, మడికొండ కృష్ణ, నూనె మానస పాల్గొన్నారు.
