సీఎం పర్యటనకు సర్వం సిద్ధం
జొన్నగిరిలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన జియో మైసూర్ గోల్డ్ మైన్స్ ప్లాంట్‌లో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, మైనింగ్ వ్యూ పాయింట్, బహిరంగ సభా ప్రాంగణం, ప్రదర్శన స్టాళ్ల ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. హెలిప్యాడ్‌కు సంబంధించిన కో-ఆర్డినేట్స్, లైటింగ్, రాకపోకల మార్గాలు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
బహిరంగ సభకు ఐదు వేల నుంచి పది వేల మంది వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక నిర్మాణం, తాగునీటి సౌకర్యం, భోజన వసతి, మరుగుదొడ్లు, పార్కింగ్, సీటింగ్ ఏర్పాట్లు, వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని పోలీసు అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీ రూట్లు, జనసమ్మర్థం నిర్వహణ, భద్రతా బందోబస్తు తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ప్రతిష్టకు తగిన విధంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఆర్ అండ్ బి ఎస్ఈ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, కర్నూలు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు, విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రదీప్ కుమార్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీవో ఓబులేసు, ఆదోని ఇన్చార్జి సబ్ కలెక్టర్ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
