12వ వేతన ఒప్పంద కమిటీ వెంటనే వేయాలి..

  • జులై 1న సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నాకు సిద్ధమైన సి ఐ టి యు

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : 12వ వేతన ఒప్పంద కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 1న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్‌ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ప్రకటించింది.

రామకృష్ణాపూర్‌లోని యూనియన్ కార్యాలయంలో జరిగిన బ్రాంచ్ కార్యవర్గ సమావేశంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీలు అల్లి రాజేందర్, సాంబార్ వెంకటస్వామి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను సాకుగా చూపుతూ కోల్ ఇండియా యాజమాన్యం వేతన ఒప్పంద కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు.

యాజమాన్య వైఖరికి నిరసనగా బొగ్గు రంగంలోని నాలుగు ఫెడరేషన్ల జేఏసీ పిలుపు మేరకు జూలై 1న దేశవ్యాప్తంగా “డిమాండ్ డే” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర రంగాల్లో అమలు చేయకుండా కేవలం బొగ్గు రంగంలోనే లేబర్ కోడ్‌లను రుద్దడం అన్యాయమని పేర్కొన్నారు. వెంటనే వేతన ఒప్పంద కమిటీని ఏర్పాటు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

లేబర్ కోడ్‌లను వ్యతిరేకిస్తున్న బీఎంఎస్ కూడా వేతన ఒప్పందం అంశంపై అన్ని యూనియన్లతో కలిసి రావాలని నేతలు కోరారు. విడిపోయి పోరాడటం వల్ల కార్మికులకే నష్టం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు జడల ప్రవీణ్, నామాని సురేష్, అసిస్టెంట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్ బాసబోయిన కుమారస్వామి, పిట్ సెక్రటరీలు నాగవెల్లి శ్రీధర్, పసునూటి శ్రీకాంత్, హరీష్, మహమ్మద్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.