గుంతలమయంగా మారిన బీసీ కాలనీ రోడ్డు.. ఇబ్బందుల్లో ప్రజలు
తాడ్వాయి, ఆంధ్రప్రభ: మండలంలోని చిట్యాల గ్రామ బీసీ కాలనీ ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో కాలనీవాసులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డంతా నీటితో నిండిపోతుండటంతో బురద మధ్యనే రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.
డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాలనీ ప్రధాన రహదారి కావడంతో స్కూల్ బస్సులు, ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీలు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడ్డాయని తెలిపారు. నిల్వ నీటిలో గుంతలు కనిపించక చిన్నారులు జారిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టడంతో పాటు నీరు నిల్వ లేకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి బీసీ కాలనీలో సీసీ రోడ్డు మంజూరు చేయించాలని విజ్ఞప్తి చేశారు.
