వ్యక్తి దారుణ హత్య..

గంటలోపే నిందితుల అరెస్ట్‌

ములుగు జిల్లా, మంగపేట, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం–ఏటూరునాగారం మండలం రాంనగర్‌ గ్రామాల మధ్య బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగపేట మండలం నరసింహసాగర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశికుమార్‌ (32)ను తోటి పనివాళ్లు గొడ్డలితో నరికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శశికుమార్‌ కమలాపురానికి చెందిన ఓ రైతు వద్ద పనిచేస్తూ వ్యవసాయ పొలంలోని పాకల వద్ద నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తోటి పనివాళ్లతో గొడవ జరిగింది. ఈ గొడవలో పూరేడుపల్లి గ్రామానికి చెందిన కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మి దంపతులు శశికుమార్‌పై గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న మంగపేట ఎస్సై టీవీఆర్‌ సూరి ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొప్పుల నరసింహారావు, కొప్పుల లక్ష్మిని అదుపులోకి తీసుకుని మంగపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

మృతుడు శశికుమార్‌కు భార్య రాధికతో పాటు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. హత్య జరిగిన సమాచారం అందిన గంటలోపే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో స్థానికులు పోలీసుల చర్యలను అభినందిస్తున్నారు.