నాగర్‌కర్నూల్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ..
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ: దేశభక్తి భావనను చాటిచెబుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం త్రివర్ణ పతాకాలతో భారీ తిరంగా ర్యాలీ కన్నులపండువగా సాగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర నాయకులు పోతుగంటి భరత్ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, కార్యదర్శి నాగేంద్రగౌడ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన మోర్చా నాయకులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు చేస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు యువతలో దేశభక్తి భావనను పెంపొందించేందుకు తిరంగా ర్యాలీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమగ్రత, ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. ర్యాలీలో పార్టీ కార్యవర్గ సభ్యులు, యువజన మోర్చా నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
