నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా వ్యాప్తంగా 2026 జనవరి నుంచి జూలై వరకు నమోదైన నేరాలు, కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల కేసులు, రౌడీ, సస్పెక్ట్ షీటర్ల బైండ్ఓవర్ తదితర అంశాలపై జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల సంఖ్యను తగ్గించడంతో పాటు నేరాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల స్వభావాన్ని విశ్లేషించి, నేరాలకు కారణమయ్యే అంశాలను గుర్తించి పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
పెండింగ్ దర్యాప్తు కేసులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని తెలిపారు. దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, పెండింగ్లో ఉన్న కేసులను ప్రాధాన్యత క్రమంలో తీసుకుని చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి అభియోగపత్రాలు, తుది నివేదికలను సకాలంలో దాఖలు చేయాలని సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న దర్యాప్తు కేసులు 30 శాతం తగ్గినప్పటికీ, మిగిలిన కేసులపై మరింత ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.
తీవ్ర నేరాల దర్యాప్తులో ఎలాంటి లోపాలకు తావివ్వకూడదని ఎస్పీ సూచించారు. నేర స్థల పరిశీలన, ఆధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల వినియోగం, నిందితుల గుర్తింపు తదితర అంశాల్లో శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. జిల్లాలో తీవ్రమైన కేసుల ఛేదన శాతం 2025లో 92.54 శాతం ఉండగా, 2026 జనవరి నుంచి జూలై వరకు 94.74 శాతానికి పెరిగిందని, ఈ పనితీరును మరింత మెరుగుపరచాలని అన్నారు.
రౌడీషీటర్లు, సస్పెక్ట్షీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని ఎస్పీ ఆదేశించారు. వారి కదలికలను పర్యవేక్షిస్తూ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులపై ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో రౌడీ షీటర్ల బైండ్ఓవర్ 80.6 శాతం ఉండగా, సస్పెక్ట్ షీటర్ల బైండ్ఓవర్ 66.2 శాతంగా ఉందని, సస్పెక్ట్ షీటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళా పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఇతర సంబంధిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు.
మిస్సింగ్ కేసుల్లో ప్రతి కేసును తీవ్రంగా పరిగణించి తక్షణమే ఆచూకీ కనుగొనేందుకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. 2026 జనవరి నుంచి జూలై వరకు మిస్సింగ్ కేసుల మొత్తం ఆచూకీ గుర్తింపు శాతం 90.37గా నమోదైందని, 48 గంటల్లోనే ఆచూకీ గుర్తించడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు.
మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులపై చట్టపరమైన చర్యలతో పాటు, డ్రగ్స్ సరఫరా చేసే మూలాలను గుర్తించి నెట్వర్క్ను ఛేదించాలని ఆదేశించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో 2026 జనవరి నుంచి జూలై వరకు 24 మాదకద్రవ్యాల కేసులు నమోదయ్యాయి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
2026లో కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడంపై నిరంతర తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ సూచించారు. ప్రజలతో నిరంతరం మమేకమై సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాలని, ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం కలిగేలా విధులు నిర్వహించాలని తెలిపారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఆదేశించారు.
చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించడంతో పాటు సామాన్య ప్రజలకు పోలీస్ సేవలు మరింత అందుబాటులో ఉండేలా పనిచేయాలని ఎస్పీ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణ, కేసుల సత్వర దర్యాప్తు, నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతమైన దర్యాప్తు, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి అధికారి, సిబ్బంది పనిచేయాలని సూచించారు.
జిల్లాలో నేరాల నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
