ధర్మపురి క్షేత్రం అభివృద్ధితో మారనున్న రూపురేఖలు

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

ధర్మపురి, ఆంధ్రప్రభ : ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం ధర్మపురి క్షేత్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలతో ధర్మపురి రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.

గురువారం జగిత్యాల జిల్లా ధర్మపురిలో అంబేద్కర్ భవన నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ధర్మపురి పట్టణంలోని వివిధ కుల సంఘాల భవనాల నిర్మాణాలకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

ధర్మపురిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా గ్రౌండ్ ఫ్లోర్‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడంతో పాటు మరో రెండు అంతస్తుల్లో విద్యార్థుల చదువుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం రూ.117 కోట్లు కేటాయించిందని, ఇందులో ధర్మపురిలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.

లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేస్తామని తెలిపారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.15 కోట్లతో పాటు అమృత్ పథకం ద్వారా నిధులు సాధించి ధర్మపురిలో అభివృద్ధి పనులు కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు.