పుట్టపర్తిలో ఘనంగా తిరంగా ర్యాలీ..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గురువారం దేశభక్తి ఉప్పొంగేలా తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సత్తెమ్మ గుడి వద్ద ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్‌ వరకు కొనసాగింది. జిల్లా కలెక్టర్‌ ఏ. శ్యామ్‌ ప్రసాద్‌, జిల్లా ఎస్పీ ఎస్‌. సతీష్‌కుమార్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

భారీ జాతీయ జెండాతో పాటు సుమారు వెయ్యి అడుగుల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేశారు.

పుట్టపర్తి ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ సాగడంతో పట్టణం మొత్తం జాతీయ జెండాలతో కళకళలాడింది. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొని దేశ సమైక్యత, జాతీయ స్ఫూర్తిని చాటారు. ప్రజల్లో దేశభక్తి భావనను మరింత పెంపొందించడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని అధికారులు ప్రజలకు అందించారు.

ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు, ప్రజలు, యువత చూపిన ఉత్సాహాన్ని కలెక్టర్‌, ఎస్పీ అభినందించారు.