గద్దె కూల్చివేతపై భగ్గుమన్న బీఆర్ఎస్
రెండు రోజుల్లో తిరిగి నిర్మించాలని డిమాండ్
అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ నేతల ధర్నా.. మున్సిపల్ అధికారులపై చర్యలకు డిమాండ్
వరంగల్, ఆంధ్రప్రభ: దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సోమవారం భారీ ధర్నా నిర్వహించారు.
పట్టణ శివారులోని మెడికల్ కళాశాల ఎదురుగా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేసి, కొద్దిరోజుల క్రితం భూమిపూజ నిర్వహించిన అనంతరం గద్దె నిర్మించారు. అయితే దానిని మున్సిపల్ అధికారులు గత రాత్రి కూల్చివేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
ధర్నాకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ హాజరై అధికారుల చర్యను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కూల్చివేసిన గద్దెను రెండు రోజుల్లో తిరిగి నిర్మించాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గద్దెను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని అన్నారు.
సంస్మరణ సభ ఉన్నందున ధర్నాను విరమిస్తున్నామని, పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రాయిడి రవీందర్‌రెడ్డి, తక్కలపెల్లి రవీందర్రావు, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, బాల్నె వెంకన్న, జక్క అశోక్, నాడెం శాంతికుమార్, గొనె యువరాజు, దార్ల రమాదేవి, నాగిశెట్టి ప్రసాద్, ఆకుల శ్రీనివాస్, మోటూరి రవి తదితరులు పాల్గొన్నారు.
