కాలు విరిగిన బాలుడు.. వైద్యం కోసం ఎదురుచూపులు
- వైద్యుల నిర్లక్ష్యంపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేష్
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, 33వ డివిజన్‌కు చెందిన సిద్ధం నరేష్ పటేల్ ఆరోపించారు. ప్రమాదంలో కాలు విరిగి నొప్పితో బాధపడుతున్న చిన్నారి చిలువేరు గగన్ పట్ల వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రమాదం జరిగి ఐదు రోజులు గడిచినా చిన్నారికి ఎలాంటి చికిత్స అందించలేదని, కనీసం వార్డులో ఉంచి వైద్యం చేయాల్సిన బాలుడిని ఆసుపత్రి ఆవరణలోని చెట్టు కింద వదిలేయడం బాధాకరమని నరేష్ పటేల్ అన్నారు.
ఆసుపత్రికి చేరుకున్న బీజేపీ నేత
ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న సిద్ధం నరేష్ పటేల్ శుక్రవారం ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో చెట్టు కింద నొప్పితో బాధపడుతున్న చిన్నారిని చూసి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే బాలుడి వద్దకు చేరుకుని వైద్యులు, సిబ్బందిని నిలదీశారు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు చిన్నారి పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఐదు రోజులుగా కాలు విరిగిన బాలుడు బాధపడుతున్నా చికిత్స ఎందుకు ప్రారంభించలేదని నిలదీశారు.
పేదలకు మెరుగైన వైద్యం అందాలి
ఎంజీఎం ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదనడానికి ఈ ఘటన నిదర్శనమని నరేష్ పటేల్ అన్నారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.
తక్షణమే చిన్నారి గగన్‌కు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి చికిత్స ప్రారంభించాలని, బాలుడి ఆరోగ్య బాధ్యత పూర్తిగా ఆసుపత్రి యాజమాన్యానిదేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పేద రోగుల తరఫున బీజేపీ ఆధ్వర్యంలో ఎంజీఎం ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
