పంట నష్టం.. పరిహారం మాయం!

  • ఏడాది గడిచినా రైతుల ఎదురుచూపులు

ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ఏడాది గడిచినా పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంఘం బుర్రన్న ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారాయా అని ఆయన ప్రశ్నించారు.

శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు అతివృష్టి, అనావృష్టి కారణంగా నష్టపోతున్నారని అన్నారు. రైతులను ఆపద సమయంలో ఆదుకునే పరిష్కారాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదని విమర్శించారు.

రైతులు పండించే పంటలకు పంటల బీమా ఉంటే కొంతమేర భరోసా కలిగేదని తెలిపారు. ప్రతి రంగానికి బీమా సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వాలు.. దేశానికి అన్నం పెట్టే రైతుల పంటలకు బీమా కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ద్వారా రైతులకు పంట నష్ట పరిహారం అందించే అవకాశం ఉండేదని తెలిపారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 2020 నుంచి ఈ పథకం అమలు కావడం లేదని, అప్పటి నుంచి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపించారు.

ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఫసల్‌ బీమా యోజన పథకం ఉపయోగపడుతుందని అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా సుమారు 20,806 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.

నదీ పరివాహక ప్రాంతాల్లో కోతకు గురైన భూములు, ఇసుక మేటలు వేసిన పంటలకు ఎకరాకు రూ.10 వేల పరిహారం అందిస్తామని ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఏ రైతుకూ ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపించారు.

పంటల బీమా అమలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు కరువు పరిస్థితులతో పంటలు దెబ్బతిని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికే పంటల సాగుకు చేసిన ఖర్చులు రైతులపై భారంగా మారాయని అన్నారు.

ఇప్పటికైనా మంత్రి ఇచ్చిన హామీని అమలు చేసి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంఘం బుర్రన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు మాణిక్‌రావు, శివాజీ, రవి, గంగారాం, పోషన్న తదితరులు పాల్గొన్నారు.