గంజాయి సాగు, అక్రమ అమ్మకాలపై పోలీసుల దాడులు

  • గద్దరాగడి తిమ్మాపూర్ లో ముమ్మర తనిఖీలు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి, తిమ్మాపూర్ ప్రాంతాల్లో గంజాయి సాగు, అక్రమ నిల్వలు, విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

గత కొంతకాలంగా మున్సిపాలిటీ పరిసర గ్రామాల్లో కొందరు పంటల మధ్య అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నట్లు, నిర్మానుష్య ప్రాంతాల్లోని ఇళ్లలో రహస్యంగా నిల్వ ఉంచి చిన్న చిన్న పొట్లాలుగా యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జాడి శ్రీధర్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మున్సిపాలిటీ పరిధిలోని పలు ఇళ్లు, ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానిక కళాశాల విద్యార్థులు, కార్మికులకు విక్రయిస్తున్న ముఠాల ఆచూకీ కోసం వాహన తనిఖీలను సైతం ముమ్మరం చేశారు.

గంజాయి సాగు, రవాణా, విక్రయాల్లో పాల్గొన్న వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అక్రమాలకు పాల్పడే వారి ఆస్తులను సీజ్‌ చేస్తామని, పదేపదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.

క్యాతన్‌పల్లి ప్రాంతంలో యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి సాగు, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 100కు లేదా రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై జాడి శ్రీధర్ తెలిపారు.