రికార్డు అసిస్టెంట్ రేణుక సస్పెన్షన్..
రూ.500 డిమాండ్ ఆరోపణలు..
వైరల్ వీడియో ఎఫెక్ట్..
ఉత్తర్వులు జారీ చేసిన నారాయణపేట కలెక్టర్
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రేణుకను నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంకసస్పెండ్ చేసినట్లు తహసీల్దార్ అశోక్ కుమార్ శుక్రవారం తెలిపారు. రైతు నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడం, దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పాటు పలు దినపత్రికల్లో వార్తా కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఊట్కూర్ తహసీల్దార్ కార్యాలయానికి ఓ రైతు తన పాత పహాణి, పట్టాదారు పాస్‌పుస్తకాలకు సంబంధించిన జిరాక్స్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఈ క్రమంలో రికార్డు అసిస్టెంట్ రేణుక రూ.500 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. అనంతరం ఈ అంశంపై వివిధ దినపత్రికల్లో కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఘటనపై వివరాలు సేకరించిన జిల్లా కలెక్టర్ రేణుకను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందాల్సిన సేవలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా అందించాలని, ఎలాంటి అవినీతి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా తహసీల్దార్ సూచించారు.
