700 ఏళ్ల నాటి మసీదు, దర్గాల పునర్నిర్మాణం

  • కొండవీడు పూర్వ వైభవానికి దోహదం చేస్తుంది : ప్రత్తిపాటి
  • వచ్చే కొండవీడు ఉత్సవాల నాటికి నిర్మాణం పూర్తి చేయాలి
  • రూ.100 కోట్లతో కొండవీడు అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశాం
  • మసీదు, దర్గా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రత్తిపాటి

యడ్లపాడు, ఆంధ్రప్రభ: 700 ఏళ్ల నాటి మసీదు,దర్గా పునర్నిర్మాణాన్ని వచ్చే కొండవీడు కోట ఉత్సవాల నాటికి పూర్తి చేయాలని, కొండవీడు కోటపై ఉన్న చారిత్రక నిర్మాణాల విశిష్టతను నేటి తరానికి తెలియచేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అభిప్రాయపడ్డారు.కొండవీడు కోటపై పునర్నిర్మించనున్న 700 ఏళ్ల నాటి మసీదు, దర్గా నిర్మాణ పనులకు శుక్రవారం ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు.శతాబ్దాల నాటి చారిత్రకవైభవానికి,మత సామరస్య ప్రతీకలకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ముందుకొచ్చిన ముస్లిం మత పెద్దలు,దర్గా నిర్వాహకుల్ని ఈ సందర్భంగా ప్రత్తిపాటి ప్రత్యేకంగా అభినందించారు.అనంతరం ఆయన మాట్లాడారు.

కొండవీడు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ..

చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశమైన కొండవీడు వైభవాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందని,రూ.100 కోట్లతో చేపట్టే అభివద్ధి పనుల ప్రణాళికను ఇప్పటికే ప్రభుత్వం ముందు ఉంచామని ప్రత్తిపాటి తెలిపారు.కొండవీడు పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా రెండు ప్రధాన జాతీయ రహదారుల్ని అనుసంధానించేలా టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు. చౌడవరం నుంచి కొండవీడు మీదుగా ఫిరంగిపురం వరకు విశాలమైన రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నామని,ఈ మార్గానికి సంబంధించిన అనుమతులు రెండు నెలల్లో మంజూరు అవుతాయన్నారు. పర్యాటకాభివృద్ధికి,సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్నందునే కొండవీడు కోట అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. కొండవీడు అభివృద్దిపై తాను ప్రత్యేక శ్రద్ధ పెట్టానని,ఈ ప్రాజెక్టు పూర్తికోసం తీవ్రంగా కృషి చేస్తున్నానని ప్రత్తిపాటి తెలిపారు. ఈ సందర్భంగా మసీదు,దర్గా పునర్నిర్మాణం కోసం పలు ముస్లిం సంఘాలు, వ్యక్తులు స్వయంగా ప్రత్తిపాటికి విరాళాలు అందచేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు,మండల పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు, జవ్వాజి మధన్ మోహన్,జిల్లా రైతు అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి,టీడీపీ నాయకులు సిలార్, మాణిక్యాల రావు, హనుమంతరావు,శివ కోటి, అజర్,పెద్దన్న,బాబురావు,కమిటీ సభ్యులు , అధికారులు తదితరులు పాల్గొన్నారు.