రోడ్లు ఆక్రమిస్తే బుల్డోజరే..

  • కెఎల్ఆర్ ఫేజ్-2లో అక్రమ రేకుల షెడ్ల కూల్చివేత
  • ​60 అడుగుల రహదారిపై టౌన్ ప్లానింగ్ అధికారుల కొరడా
  • ఆక్రమణదారులకు అధికారుల హెచ్చరిక

మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రజా వినియోగానికి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు కేటాయించిన రహదారి స్థలాలను ఆక్రమిస్తే సహించేది లేదని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ మేడ్చల్‌లోని కెఎల్ఆర్ వెంచర్ ఫేజ్-2లో 60 అడుగుల ప్రధాన రహదారి స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ రేకుల షెడ్లను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏసీపీ భాస్కర్ గౌడ్, టీపీఎస్ సాయి తేజ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి, రహదారికి అడ్డుగా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగించారు.

దీంతో సదరు మార్గంలో రాకపోకలకు మార్గం సుగమమైంది. ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వెంచర్లలో రోడ్ల కోసం కేటాయించిన స్థలాలను ఆక్రమించి షెడ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపారు. చట్టవిరుద్ధంగా రోడ్డు స్థలాలను ఆక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు, రహదారుల ఆక్రమణలపై నిఘా మరింత పెంచి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.