బడా భీమ్‌గల్ లో ‘జలసిరి’ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం

  • భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు ఎంతో ప్రయోజనం,
  • జలసిరి పై ఇంకుడు గుంత నిర్మాణం పై గ్రామస్తులకు అవగాహన
  • కల్పిస్తున్న ఎంపీడీవో సంతోష్ కుమార్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం బడా భీమ్‌గల్ గ్రామంలో జలసిరి కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ విష్ణువర్ధిని ఆధ్వర్యంలో శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) సంతోష్ కుమార్, ఏపీవో నర్సయ్య హాజరై గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న జలసిరి కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కమ్యూనిటీ భూముల్లో పంట కుంటల నిర్మాణంపై ఎస్సీ కమ్యూనిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న ఎస్సీ కమ్యూనిటీ భూముల్లో పంట కుంటలు నిర్మించి వాటిని సాగులోకి తీసుకురావాలని సూచించారు. పంట కుంటల నిర్మాణం ద్వారా వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని, ఎండిపోయిన బోర్లలో నీటి సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

భవిష్యత్తులో నీటి కొరతను నివారించేందుకు జల సంరక్షణ చర్యలు ఎంతో అవసరమని ఆయన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సీ కమ్యూనిటీ సభ్యులు తమకు సంబంధించిన సుమారు 100 ఎకరాల భూమిలో 20 వరకు పంట కుంటలు నిర్మించేందుకు అంగీకారం తెలిపారు.

అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఎస్సీ కమ్యూనిటీ భూములను సందర్శించి పంట కుంటల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాగుల గంగా మోహన్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాహుల్, కారోబార్ నర్సయ్య, శేఖర్, ఎస్సీ భూముల లబ్ధిదారులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.