రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి

సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం

భూపాలపల్లి టౌన్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడి సమస్యలను పరిష్కరించాలని ఆలిండియా కిసాన్‌ సభ జిల్లా కార్యదర్శి మామిడాల సమ్మిరెడ్డి, అధ్యక్షుడు గుంటి చంద్రమౌళి డిమాండ్‌ చేశారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భూపాలపల్లి కలెక్టరేట్‌ ఎదుట నిరసన ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పోడు భూములకు అసైన్‌మెంట్‌ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ఇప్పటికే నిర్వహించిన సర్వేల ఆధారంగా అర్హులైన రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రైతులకు పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో జరుగుతున్న నష్టాలను నివారించాలని కోరారు. ప్రజా సమస్యలపై ప్రజలు అందించే వినతులను అధికారులు, ప్రజాప్రతినిధులు స్వీకరించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

రైతులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కుడుదుల వెంకటేష్‌, రాజేందర్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్‌, చంద్రమౌళి, లావణ్య, రాజేశ్వరి, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.