క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం

ప్రతి ఉద్యోగికీ క్రీడల్లో భాగస్వామ్యం కల్పిస్తాం: సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి

హనుమకొండ, ఆంధ్రప్రభ: క్రీడలతో ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం కలుగుతుందని, ఏ సర్కిల్‌ జట్టు విజయం సాధించినా అది సంస్థ విజయమేనని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. ఉద్యోగులందరూ ఒకే కుటుంబంలా భావించి క్రీడా స్ఫూర్తితో, ఆరోగ్యకరమైన వాతావరణంలో పోటీపడాలని సూచించారు.

మంగళవారం నార్తర్న్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి నూతనోత్సాహాన్ని నింపుతాయని తెలిపారు. సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

ఉద్యోగుల మధ్య సత్సంబంధాలు, అనుబంధం పెరిగినప్పుడే సంస్థ పట్ల అంకితభావం పెరుగుతుందని, తద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

బ్యాడ్మింటన్‌, క్రికెట్‌, క్యారమ్స్‌, చెస్‌, టేబుల్‌ టెన్నిస్‌, వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ సర్కిళ్లకు చెందిన 150 మందికి పైగా క్రీడాకారులు పోటీపడుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సంస్థ ప్రతిష్ఠను పెంచేలా ప్రతి ఏడాది క్రీడలు, సాంస్కృతిక పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్వయంగా క్యారమ్స్‌ ఆడి ఉద్యోగుల్లో ఉత్సాహం నింపారు. డైరెక్టర్లు వి. మోహన్‌రావు, వి. తిరుపతిరెడ్డి, టి. మధుసూదన్‌, సి. ప్రభాకర్‌, చీఫ్‌ ఇంజినీర్లు, స్పోర్ట్స్‌ కమిటీ సభ్యులు మాధవరావు, వేణుబాబు, హేమంత్‌కుమార్‌, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ ఎన్‌. జగన్నాథ్‌, సభ్యులు ప్రేమ్‌కుమార్‌, యాకుబ్‌పాషా తదితరులు పాల్గొన్నారు.