తల్లి-శిశువు రక్షణకు ప్రభుత్వం మరో ముందడుగు
- పోలవరం జిల్లాలో నాలుగు 102 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభం
- ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి
- కలెక్టర్ కె దినేష్ కుమార్
రంపచోడవరం కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న 102 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ (డ్రాప్ బ్యాక్) సేవలను మంగళవారం రంపచోడవరం ఐటిడిఎ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభించారు. పోలవరం జిల్లాకు కేటాయించిన నాలుగు వాహనాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జి రెడ్డి మాట్లాడుతూ గిరిజన, గ్రామీణ, దూర ప్రాంతాల్లో నివసించే గర్భిణీలు, ప్రసూతి తల్లులు రవాణా సమస్యల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంతో పాటు తల్లి, శిశువు ఆరోగ్య రక్షణకు ఈ సేవలు ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చివరి లబ్ధిదారుడి వరకు చేరాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని సొళ్ళ బొజ్జి రెడ్డి తెలిపారు. తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు పూర్తిగా ఉచితంగా అందించ బడటం వల్ల పేద కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గుతుందని, ఈ వాహనాలను ప్రజలు సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులు, నవజాత శిశువులను సురక్షితంగా, సమయానుకూలంగా వారి ఇళ్లకు చేర్చడమే ఈ సేవల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రసవానంతరం తల్లులు, నవజాత శిశువులు సురక్షితంగా ఇంటికి చేరడం ఆరోగ్య పరిరక్షణలో కీలక అంశమని చెప్పారు. 102 తల్లి-బిడ్డ ఎక్స్ప్రెస్ సేవల ద్వారా ప్రభుత్వ వైద్య సంస్థల నుండి నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వరకు రవాణా సౌకర్యం కల్పించడం ద్వారా ప్రసూతి అనంతర సమస్యలను తగ్గించే అవకాశం ఉంటుందని వివరించారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మరియు ఇతర వైద్య సంస్థల్లో ఈ సేవలను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేపట్టాలని, సేవల అమలులో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని దినేష్ కుమార్ సూచించారు.ఈ 102 తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ ఆధునిక సౌకర్యాలతో పరికరాలతో ఈ వాహనం డిజైన్ చేయడం ఆయన తెలిపారు. ఎక్కడైనా అత్యవసర సేవల కొరకు కాల్ సెంటర్ సంప్రదించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను పోలవరం జిల్లాలోని గర్భిణీ స్త్రీలు సద్వినియోగపరచుకోవాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో రంపచోడవరం రెవిన్యూ డివిజనల్ అధికారి కె.స్వాతి, మైనార్టీ సెల్ డైరెక్టర్ షేక్ సుభాని,డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పి. సరిత,డి సి హెచ్ ఎస్ సాంబశివరావు, జిల్లా మలేరియా అధికారి భాస్కర్, తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, ఉమ్మడి ప్రభుత్వ నాయకులు అడబాల బాపిరాజు,పి శ్రీనివాసరావు, స్వప్న కుమారి,వై నిరంజని దేవి , వెంకన్న బాబు, గణపతి, రమణ,జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా.పి. సరిత, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నేతలు, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయకర్తలు, వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
