Young Sarpanch | తొలి అడుగులోనే…

Young Sarpanch | తొలి అడుగులోనే…

  • సేవా గుణాన్ని చాటుకున్న యువ సర్పంచ్
  • కోనాపూర్ నూతన సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : అక్షర దీపం వెలిగించిన ఆశావహ నాయకుడు సాధారణంగా పదవి రాగానే అధికారం గురించి ఆలోచిస్తారు చాలామంది. కానీ ఆ యువ సర్పంచ్ మాత్రం తన ఊరి భవిష్యత్తు గురించి ఆలోచించాడు. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రోజే అందరినీ ఆశ్చర్యానికి, అంతకు మించి ఆనందానికి గురిచేసే ఒక గొప్ప నిర్ణయాన్ని కమ్మర్ పల్లి మండలం కోనాపూరు గ్రామ నూతన సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి తీసుకున్నాడు. తన ఐదేళ్ల జీతం, తన గ్రామ పిల్లల చదువుల కోసం అంటూ, తాను వచ్చే ఐదు సంవత్సరాల పాటు పొందే వేతనాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి కేటాయిస్తూ మొదటి సంతకం చేశారు.

వెలుగు నింపే నిర్ణయం :

ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఒక గొప్ప ఆశయం ఉంది. ఆ శిథిలావస్థలో ఉన్న గోడలు, సరిగ్గా లేని మౌలిక వసతులు రేపటి తరాన్ని వెనక్కి నెట్టకూడదని ఆయన తపించారు. ఏ పల్లెలో అయితే చదువుకున్నారో, అదే పల్లెలోని బడిని ఒక దేవాలయంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. గుండెకు హత్తుకునే అంశంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. పదవి అంటే భోగం కాదు, అదొక బాధ్యత అని నిరూపించిన ఈ యువ సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి చొరవ నిజంగా అభినందనీయమని గ్రామ ప్రజలు అన్నారు.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్న గురజాడ మాటలను ఆయన అక్షరాలా నిజం చేశారు. ఆ పసిపిల్లల కళ్లలో మెరిసే విద్యా కుసుమాలకు ఆయన త్యాగమే మొదటి మెట్టు. నిజమైన నాయకత్వానికి నిలువుటద్దం ఈ యువ సర్పంచ్ అరుణ్ రెడ్డి. పల్లె సీమల్లో ఇలాంటి మార్పు కోరుకునే మరెందరో యువతకు ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత కావాలని కోనాపూర్ గ్రామ ప్రజలు ఆకాంక్షించారు. అలాగే కోనాపూర్ 10వ తరగతి విద్యార్థుల గత రికార్డ్, 543 మార్కుల కంటే ఎక్కువ మార్కులను సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10,000 క్యాష్ ప్రైజ్ ను ప్రకటించారు.