ఆసుపత్రుల అభివృద్ధికి ప్రాధాన్యత

ఆసుపత్రుల అభివృద్ధికి ప్రాధాన్యత
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ:
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) కిరణ్ రాజ్ పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు వార్డులు, క్యాజువాలిటీ విభాగాలను పరిశీలించి, అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.
రానున్న కొద్ది రోజుల్లోనే బెల్లంపల్లి ఆసుపత్రిలో వైద్య నిపుణులను, అవసరమైన సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సీఎంఓ స్పష్టం చేశారు. అలాగే, సింగరేణి కార్మికులు, వారి కుటుంబాల సౌకర్యార్థం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కార్డియాలజీ క్యాథ్ ల్యాబ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. దీనివల్ల గోలేటి నుంచి భూపాలపల్లి వరకు ఉన్న సుమారు 1.80 లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు.
సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న వైద్యుల, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సీఎంఓ తెలిపారు. ఇప్పటికే 32 మంది వైద్యులు, 175 మంది సిబ్బంది పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించామని, కార్మిక సంఘాల అభ్యర్థన మేరకు త్వరలోనే నియామక ప్రక్రియను చేపడతామని ఆయన పేర్కొన్నారు.
బెల్లంపల్లి ఆసుపత్రికి సంబంధించి నెలకు ఆరుగురు వైద్య నిపుణులు వారానికి ఒక రోజు చొప్పున క్యాంపు నిర్వహిస్తున్నారని తెలిపారు. త్వరలోనే గుండె, కంటి వైద్య నిపుణులు నెలకు రెండు రోజులు ఇక్కడ క్యాంపు నిర్వహించి కార్మికులకు, వారి కుటుంబాలకు వైద్య చికిత్సలు అందజేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి డీవైసీఎంఓ పాండురంగచారి పాల్గొన్నారు.
