ముకరా- కే గ్రామస్తుల వినూత్న నిరసన
ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆన్ లైన్ డిజిటల్ లావాదేవీల్లో జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించిన ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ముకరా- కే గ్రామస్తులు ఆరు గ్యారెంటీ పథకాల అమలు తీరుపై వినూత్న నిరసన చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు బతుకమ్మ పండుగలు గడుస్తున్నా గ్యారెంటీ సంక్షేమ పథకాలు అందడం లేదని ఈ రోజు మహిళలంతా ప్లకార్డులతో బతుకమ్మ ఆడుతూ పాడుతూ వినూత్న నిరసనకు దిగారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీ లేమాయే ఉయ్యాలో… అని ఆడుతూ పాడుతూ ఎంగిలి బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) లో ప్రతి మహిళకు నెలకు రూ.2,500, చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు, రూ.4,000 పింఛన్, ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఉయ్యాలో.. ప్లకార్డుల బతుకమ్మను పేర్చి మహిళలంతా ఆడుతూ సందడి చేశారు.
ఆ గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అధికారంలో వచ్చి 22 నెలలు గడుస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన పాలకులు రెండు బతకమ్మ పండుగలు దాటిన వాటి గురించి ఊసేత్తడం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, సోనియా రాహుల్ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కోటీ మంది మహిళలకు ఎప్పుడు కోటీశ్వరులు చేస్తారని ఆమె సూటిగా ప్రశ్నించారు.
