AP | మెగా సిటీగా రాజమహేంద్రవరం… సీఎం చంద్రబాబు
AP | మెగా సిటీగా రాజమహేంద్రవరం… సీఎం చంద్రబాబు
- ఆరు జిల్లాల్లో 525 పుష్కర ఘాట్లు…
అమరావతి: గోదావరి పుష్కరాలు 2027ను పురస్కరించుకుని గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాల్లో భారీగా మౌలిక వసతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో 212 కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తోన్న గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం 525 ఘాట్లను సిద్ధం చేసేందుకు ప్లాన్ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం.
ప్రస్తుతం ఉన్న 288 ఘాట్లతో పాటు కొత్తగా మరో 237 ఘాట్లను నిర్మించనున్నారు. పోలవరం జిల్లాలోని ‘గుండాల’ వద్ద మొదటి ఘాట్, అలాగే అంతర్వేది, బలుసుతిప్ప, గోవాలంక, నర్సాపురంలలో చివరి ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 4.5 కిలోమీటర్ల ఘాట్ల పొడవు కాస్తా 9.9 కిలోమీటర్లకు పెరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోనే 150కి పైగా ఘాట్లను నిర్మించనున్నారు.
భారీ బడ్జెట్తో మౌలిక వసతుల కల్పన…
పుష్కరాల నిర్వహణను కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం చేయకుండా, గోదావరి పరివాహక ప్రాంతానికి శాశ్వత ఆస్తిగా మారేలా మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక రాజమహేంద్రవరం (రాజమండ్రి) నగరాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి మెగాసిటీగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
పుష్కర ఘాట్లు, రహదారులు, టెంట్లు, మరుగుదొడ్లు, తాగునీరు, శానిటేషన్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ పరిధిలో రాజమహేంద్రవరం, నర్సాపురం సహా వివిధ పట్టణాల్లో రూ.1,974 కోట్ల వ్యయంతో 1,660 పనులు చేపట్టనున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో రూ.1,080 కోట్ల విలువైన 1,140 పనులు జరగనున్నాయి. ఇప్పటికే రూ.211.97 కోట్లకు సంబంధించి 132 పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.
ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పి.నారాయణ, హోం మంత్రి వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, వాసంశెట్టి సుభాష్లతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) జి.సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, దేవాదాయ, జలవనరులు, ఆర్థిక, పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
