AP Aqua Farmers Crisis | సంక్షోభంలో ఆక్వా రంగం

AP Aqua Farmers Crisis | సంక్షోభంలో ఆక్వా రంగం

AP Aqua Farmers Crisis | భానుడి భగభగలు, విద్యుత్ కోతలతో ఆక్వా రంగానికి గండం

ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు చెరువుల్లో రొయ్యల మరణాలు

ఆక్సిజన్ కొరతతో జనరేటర్లపై ఆధారపడుతున్న రైతులు

మేత ధరలు, డీజిల్ ఖర్చులతో పెరుగుతున్న పెట్టుబడి భారం

AP Aqua Farmers Crisis | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన ఆక్వా రంగం ప్రస్తుతం ఎన్నడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చుతూ డాలర్ల పంటగా పేరొందిన రొయ్యల సాగు ఇప్పుడు ప్రకృతి ప్రతికూలతలు, విద్యుత్ అంతరాయాలు, మార్కెట్ ఒడిదుడుకులు, పెరిగిన పెట్టుబడి వ్యయాల మధ్య విలవిల్లాడుతోంది. రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ప్రస్తుతం ఆందోళనలో మునిగిపోయారు.

జూన్ ప్రారంభంలోనే మండుతున్న ఎండలు, ఉక్కపోత, అప్రకటిత విద్యుత్ కోతలు కలిసి రొయ్యల చెరువులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోవడంతో రొయ్యలు పైకి తేలి చనిపోతున్నాయి. పెట్టుబడులు కోట్లలో పెట్టి పంటను సాగు చేసిన రైతులు ఇప్పుడు చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రంగానికి వెన్నెముకగా నిలిచే జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే రొయ్యలలో అత్యధిక శాతం ఈ జిల్లాల నుంచే వస్తుంది. అమెరికా, చైనా, జపాన్, దక్షిణ కొరియా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల వెనుక ఈ జిల్లాల రైతుల కష్టం ఉంటుంది.

కానీ ప్రస్తుతం ఈ జిల్లాలన్నింటిలోనూ ఒకే సమస్య వెంటాడుతోంది. భానుడి ప్రతాపం, నీటి ఉష్ణోగ్రతలు పెరగడం, విద్యుత్ అంతరాయాలు కలిసి రొయ్యల జీవన చక్రాన్ని దెబ్బతీస్తున్నాయి. రాష్ట్ర ఆక్వా ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

కోనసీమ, కాట్రేనికోన, ఐ.పోలవరం, ముమ్మిడివరం, అమలాపురం, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, మొగల్తూరు ప్రాంతాల్లో వేలాది చెరువులు ఉన్నాయి. గత పది రోజులుగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా చెరువులలోని నీరు అసాధారణంగా వేడెక్కుతోంది. రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

చాలాచోట్ల 60-40 కౌంట్ రొయ్యలు మరణిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే కొద్ది గంటల్లోనే ఆక్సిజన్ స్థాయులు పడిపోతుండటంతో జనరేటర్లను వినియోగించక తప్పడం లేదు. దీంతో రైతుల ఖర్చులు అమాంతం పెరిగిపోతున్నాయి.

కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మొవ్వ, పెడన ప్రాంతాలు ఆక్వా సాగుకు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం రైతులు చెరువుల వద్దే రాత్రింబవళ్లు గడుపుతున్నారు. విద్యుత్ ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో జనరేటర్లను సిద్ధంగా ఉంచుతున్నారు.

ప్రకాశం జిల్లాలో ఒంగోలు పరిసర ప్రాంతాలు, తీర ప్రాంత మండలాల్లో రొయ్యల సాగు గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో కూడా నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయాల కారణంగా ఏరియేటర్లు నిలిచిపోవడంతో నీటి నాణ్యత దెబ్బతింటోందని రైతులు చెబుతున్నారు. దీంతో రొయ్యల పెరుగుదల మందగించడంతో పాటు, మరణాల శాతం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరులోనూ అదే దుస్థితి

దేశంలోనే అత్యధిక ఆక్వా ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా ఒకటి. కావలి, బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరుపేట, కోవూరు, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు ప్రాంతాల్లో భారీ స్థాయిలో సాగు జరుగుతోంది. ఈ ప్రాంతాల్లోనూ తీవ్ర ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చెరువుల్లో నీటి మట్టాలు తగ్గిపోవడంతో పాటు నీటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఫలితంగా రొయ్యల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

మేత ధరల భారం, పెట్టుబడులు రెట్టింపు

ఆక్వా రైతులను వెంటాడుతున్న మరో ప్రధాన సమస్య మేత ధరల పెరుగుదల. గత రెండేళ్లలో మేత ధరలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు మందులు, రసాయనాలు, కార్మిక వ్యయాలు కూడా పెరిగాయి.

ప్రస్తుతం ఒక ఎకరా రొయ్యల సాగుకు రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవసరమవుతోందని రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే వరకు సుమారు 100 రోజులు పడుతుంది. ఈ కాలంలో చిన్న సమస్య వచ్చినా మొత్తం పెట్టుబడి ప్రమాదంలో పడుతోంది.

విద్యుత్ కోతల కారణంగా రైతులు జనరేటర్లను నడపాల్సి వస్తోంది. ఒక ఎకరా చెరువుకు గంటకు కనీసం లీటరు డీజిల్ అవసరమవుతోంది. ప్రస్తుతం డీజిల్ ధర రూ.104కు పైగా ఉండటంతో రోజువారీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగు జరుగుతున్న నేపథ్యంలో రోజుకు కోట్ల రూపాయల అదనపు భారం రైతులపై పడుతోందని ఆక్వా సంఘాలు అంచనా వేస్తున్నాయి.

మార్కెట్ కూడా సహకరించడం లేదు

అంతర్జాతీయ మార్కెట్ కూడా సహకరించడం లేదు. ఒకవైపు ఉత్పత్తి సమస్యలు, మరోవైపు మార్కెట్ పరిస్థితులు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మందగమనం ప్రభావంతో ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేవు. అమెరికా, చైనా, యూరోప్ దేశాలకు వెళ్లే రొయ్యల కొనుగోళ్లు మందగించడంతో ప్రాసెసింగ్ యూనిట్లు కూడా కొనుగోళ్లలో జాగ్రత్తలు పాటిస్తున్నాయి. ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు.

ఉపాధిపై ప్రభావం

ఆక్వా రంగం కేవలం రైతులకు మాత్రమే పరిమితం కాదు. ఫీడ్ కంపెనీలు, హ్యాచరీలు, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీలు, రవాణా రంగం, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, కార్మికులు ఇలా లక్షలాది మంది జీవనాధారం ఈ రంగంపైనే ఆధారపడి ఉంది.

రొయ్యల ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం తక్షణం స్పందించాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా ఆక్వా క్లస్టర్లలో నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ నిర్వహణ పనులను రాత్రి వేళల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అదేవిధంగా డీజిల్ సబ్సిడీ, మేత ధరల నియంత్రణ, తక్కువ వడ్డీ రుణాలు, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, గిట్టుబాటు ధర హామీ వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కాపాడుకోవాల్సిన సమయం

రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యాన్ని అందించే ఆక్వా రంగం ప్రస్తుతం కూడలిలో నిలిచింది. ఒకవైపు ప్రకృతి ప్రతికూలతలు, మరోవైపు విద్యుత్ సమస్యలు, ఇంకోవైపు మార్కెట్ అనిశ్చితి కలిసి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి.

ఉభయ గోదావరి నుంచి నెల్లూరు వరకు, కృష్ణా నుంచి ప్రకాశం వరకు ప్రతి ఆక్వా బెల్ట్‌లోనూ ఇప్పుడు ఒకే ప్రశ్న వినిపిస్తోంది…

“రొయ్యలను కాపాడుకోవాలా, లేక పెట్టుబడులను కాపాడుకోవాలా?”

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఈ రంగాన్ని గట్టెక్కించేందుకు తక్షణ చర్యలు తీసుకోకపోతే ‘డాలర్ల పంట’గా వెలుగొందిన ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి జారిపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆక్వా రైతుల కళ్లన్నీ ప్రభుత్వ నిర్ణయాలపైనే నిలిచాయి.


Leave a Reply