కూటమి పాలన విజయోత్సవానికి దుర్గమ్మ ఆశీస్సులు
కూటమి పాలన విజయోత్సవానికి దుర్గమ్మ ఆశీస్సులు
వన్‌టౌన్ నుంచి కనకదుర్గ ఆలయం వరకు భారీ ర్యాలీ
చంద్రబాబు దీర్ఘాయుష్షు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన నాయకులు
వైసీపీపై బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు
విజయవాడ (ఇంద్రకీలాద్రి), ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ చైనా వాల్ నుంచి కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు తరువాత దుర్గగుడి ఘాట్ రోడ్డులోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి సారె సమర్పించి రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండి రాష్ట్ర అభివృద్ధికి మరింత శక్తి అందించాలని దుర్గమ్మను ప్రార్థించినట్లు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అరాచకాలు జరిగాయని ప్రజలు గమనించారని, అందుకే ప్రజలు ఆ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని వెంకన్న వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు 164 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం అభివృద్ధిపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ రోజుకు 20 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని, ప్రతిపక్ష పాత్రను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
