పని లేకుంటే బయటకు రాకండి…

పని లేకుంటే బయటకు రాకండి…
జిల్లా ప్రజలకు కలెక్టర్ సాయి కాంత్ వర్మ సూచన
రానున్న ఐదు రోజులు ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం
గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ సి.ఎం. సాయి కాంత్ వర్మ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను ప్రస్తావించారు.
జిల్లాలో హీట్ ఇండెక్స్ తీవ్రస్థాయిలో నమోదయ్యే అవకాశముందని, ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 50 డిగ్రీల వరకు చేరవచ్చని తెలిపారు. అత్యవసర అవసరాలు ఉంటే తప్ప ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగులు ఉపయోగించాలని, వదులైన దుస్తులు ధరించాలని, తరచూ నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలని సూచించారు. చిన్నారులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎండలోకి వెళ్లకుండా కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
వడదెబ్బ బారిన పడకుండా తలపాగా, టోపీ ధరించాలని, చెవుల్లోకి వేడి గాలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కళ్ల రక్షణ కోసం సన్‌గ్లాసెస్ వినియోగించాలని సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జనసమ్మర్థ ప్రాంతాల్లో తాత్కాలిక నీడ ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉపాధి హామీ, భవన నిర్మాణం వంటి బహిరంగ పనులను ఉదయం, సాయంత్రం చల్లని వేళల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లి వైద్య సేవలు పొందాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు.
