ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ వెల్లడి
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : జిల్లాలో 2026 సంవత్సరానికి నిర్వహించనున్న ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మరియు ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన పరీక్షల షెడ్యూల్, కేంద్రాల వివరాలు, విద్యార్థులకు అనుసరించాల్సిన సూచనలను వెల్లడించారు.
జిల్లాలో గుర్తించబడిన పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే భౌతిక శాస్త్రం మరియు జీవశాస్త్రం పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే నిర్వహించనున్నట్లు వివరించారు.
ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ప్రకారం మే 25న మొదటి భాష (గ్రూప్-ఏ), కాంపోజిట్ కోర్స్ పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. మే 26న రెండో భాష, మే 28న ఇంగ్లీష్, మే 29న గణితం, మే 30న భౌతిక శాస్త్రం, జూన్ 1న జీవశాస్త్రం, జూన్ 2న సామాజిక శాస్త్రం పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3న కాంపోజిట్ కోర్స్ పేపర్-2 మరియు ఓఎస్సీసీ ప్రధాన భాష పేపర్-1, జూన్ 4న ఓఎస్సీసీ ప్రధాన భాష పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. కాంపోజిట్ కోర్స్ మరియు ఓపెన్ స్కూల్కు సంబంధించిన పేపర్లు జూన్ 3, 4 తేదీల్లో జరుగుతాయని తెలిపారు.
జిల్లాలో మొత్తం 32 ఎస్సెస్సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. చిత్తూరు మండలంలో డాక్టర్ వరదప్ప నాయుడు మున్సిపల్ హైస్కూల్, విజ్ఞాని దీప్తి హైస్కూల్, నారాయణ ఈఎంహెచ్ఎస్, శ్రీ చైతన్య ఈఎం హైస్కూల్, ఏవీఆర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కంఫర్ట్ ఈఎంహెచ్ఎస్, గండ్లపల్లె మున్సిపల్ హైస్కూల్లను పరీక్షా కేంద్రాలుగా గుర్తించారు. అలాగే ఎస్.ఆర్.పురం, బంగారుపాళ్యం, పలమనేరు, బైరెడ్డిపల్లె, వి.కోట, రామకుప్పం, రాళ్లబుడుగూరు, కుప్పం, పుంగనూరు, చౌడేపల్లె, కార్వేటినగరం, నగరి మరియు పులిచెర్ల మండలాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఏపీఓఎస్ఎస్ ఎస్ఎస్సీ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లాలో మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చిత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, కుప్పం మరియు పులిచెర్ల ప్రాంతాల్లో ఈ కేంద్రాలు పనిచేయనున్నాయి. అదేవిధంగా ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 7 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చిత్తూరు, జి.డి.నెల్లూరు, నగరి, పలమనేరు, పుంగనూరు కుప్పం ప్రాంతాల్లో ఈ కేంద్రాలు అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. హాల్టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, పరీక్షా కేంద్రాలకు నిషేధిత వస్తువులు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. పరీక్షా నియమావళిని కచ్చితంగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల తేదీలు, సమయాలు, పరీక్షా కేంద్రాల వివరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు.
