Gold Scam | జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..

Gold Scam | జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు..

Gold Scam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌పై మోసం ఆరోపణలు వెలుగుచూశాయి. ముఖ్యమంత్రి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నమ్మబలికి, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానని చెప్పి బాధితుల నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బాధితుల కథనం ప్రకారం.. హిమాయత్‌నగర్, నీలోఫర్ ప్రాంతాల్లో విడతల వారీగా సూర్య భాయ్‌కు మొత్తం రూ.30 లక్షలు అందజేశారు. అయితే డబ్బులు తీసుకున్నప్పటికీ బంగారం ఇవ్వకపోవడంతో పాటు నగదును కూడా తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు ఆయన నివాసానికి వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా సూర్య భాయ్ తన వద్ద ఉన్న మూడు ఐఫోన్లను ఇచ్చి, వాటి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పినట్లు, అలాగే రూ.20 లక్షల చెక్కును కూడా అందజేసినట్లు బాధితులు తెలిపారు. అయితే బాధితులు వెళ్లిపోయిన తర్వాత వారిపైనే అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో సూర్య భాయ్ ఫిర్యాదు చేశాడు. తనను బెదిరించి మూడు ఐఫోన్లను లాక్కెళ్లారని ఆరోపించాడు.

ఈ రెండు ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు అసలు వ్యవహారాన్ని గుర్తించారు. బంగారం కొనుగోలు పేరుతో బాధితులు సూర్య భాయ్‌కు రూ.30 లక్షలు చెల్లించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో అత్తాపూర్ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, కేసు పరిధి ప్రకారం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.