డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్
- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆసిఫాబాద్ పట్టణంలో 2కే రన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నితికా పంత్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలను అలవర్చుకుని మాదకద్రవ్యాలు, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం, డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు సమాజాన్ని చైతన్యపరచడం, యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచే సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
అనంతరం ఏర్పాటు చేసిన **”వాల్ ఆఫ్ ప్రామిస్”**పై ఎస్పీ నితికా పంత్‌తో పాటు పోలీసు అధికారులు, విద్యార్థులు డ్రగ్స్ వ్యతిరేక సందేశాలు రాసి సంతకాలు చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు.
యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి వర్గం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి ప్రారంభమైన 2కే రన్ గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా తిరిగి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంది.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) చిత్తరంజన్, ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్, పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్లు, ఎక్సైజ్ శాఖ అధికారులు, ఆసిఫాబాద్ స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు, వివిధ పాఠశాలల విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
