AP | రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం..

AP | రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం..
కోసిగి. ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కోసిగి లోని 3 వ వార్డు కు చెందిన వెంకట లక్ష్మీ కంపాటి శ్రీనివాసులు దంపతుల మూడవ కుమారుడు కోసిగి బాలుర హైస్కూల్లో 9 వతరగతి చదువుతున్న కంపాటి నరసింహులు, ( 16) అనే విద్యార్థి కోసిగి మండలం సజ్జల గుడ్డం గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు బస్సు కిందపడి,అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన శుక్రవారంనాడు చోటు చేసుకునింది.
పోలీసులు సంఘటన వివరాలు పరిశీలిస్తే మృతుడు కంపాటి నరసింహులు, ప్రస్తుతం కోసిగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుచుండగా,శుక్రవారంనాడు గుడ్ ఫ్రైడే సెలవు కారణంగా ఇంటి వద్ద ఉండినాడని, అతని పెదనాన్న కూతురు ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిమిత్తం బంధువులను పిలవడానికి, ఉదయం సుమారు 9గంటలకు మృతుడు నరసింహులు మరియు అతని పెదనాన్న కొడుకు విజయ్ గోపాల్ కలిసి ఏపీ21ఏ ఎస్ 1571 నంబరు గల మోటార్ సైకిల్‌పై కోసిగి నుండి సజ్జలగుడ్డం గ్రామం వైపు బయలుదేరినారని తెలిపారు.విజయ్ గోపాల్ మోటార్ సైకిల్ తొలుతుండగా, నరసింహులు వెనకాల కూర్చొని ఉండినాడని. సుమారు 9:30 గంటల సమయంలో కోసిగి – సజ్జల గుడ్డం రహదారిలో, డి.సి. నారాయణ పొలం వద్ద నాగప్ప కట్ట సమీపంలో వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ఏ పి 21జెడ్ 0456 నంబరు గల ఐరన్ గల్లు బస్సు డ్రైవర్ కురువ రామలింగ, అతివేగంగా, అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా నడుపుతూ వీరికి ఎదురుగా వస్తున్నందున, బస్సు ఢీకొట్టే ప్రమాదం ఉందని భావించి మోటార్ సైకిల్ నడుపుతున్న విజయ్ గోపాల్ సడెన్ బ్రేక్ వేయడంతో వాహనం స్కిడ్ అయినదని తెలిపారు.
ఈ క్రమంలో విజయ్ గోపాల్ రోడ్డుకు ఎడమ వైపున పడగా, మృతుడు నరసింహులు రోడ్డుపై పడటంతో, బస్సు ఎడమ వైపు టైరు అతని శరీరంపై ఎక్కగా అతనికి తీవ్ర రక్తగాయాలు అయి అక్కడికక్కడే చనిపోవడం జరిగినదన్నారు. ఈ మేరకు మృతుని తండ్రి శ్రీనివాసులు ఇఛ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించి నట్లు సిఐ మంజనాథ్, ఎస్సై రమేష్ రెడ్డి లు తెలిపారు.కాగా చేతికొచ్చిన కుమారుడు ఇలా ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
