క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి..

క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి..

జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ పి. యుగంధర్

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : క్షయ రహిత సమాజం కోసం సమష్టిగా కృషి చేద్దామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ పి. యుగంధర్ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో క్షయవ్యాధి (ట్యూబర్‌కులోసిస్–టిబి) నియంత్రణ, చికిత్స, నివారణ చర్యలపై అవగాహన ర్యాలీ జరిగింది. డిఎంహెచ్ఓ కార్యాలయంలో నుంచి సాగిన ర్యాలీకి డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ టిబి ముక్త భారత్ లక్ష్యంతో స్క్రీనింగ్ కార్యక్రమాలు, యాక్టివ్ కేస్ ఫైండింగ్ డ్రైవులు నిర్వహిస్తూ ప్రారంభ దశలోనే రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. జిల్లా లేప్రోసి, ఎయిడ్స్, టిబి నివారణ అధికారి మాట్లాడుతూp జిల్లాలో టిబి కేసులు సాధారణంగా నియంత్రణలో ఉన్నప్పటికీ, కొన్నిl ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

టీబీ ముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన 100p రోజుల ప్రత్యేక అభియాన్‌ను 2025 మార్చి నుంచి దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించిందని చెప్పారు. నేడు ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మరో 100 రోజుల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కార్యక్రమాన్ని ప్రారంభించనుందన్నారు. లక్షణాలు లేకపోయినా ప్రమాదంలో ఉన్న ప్రజలకు ముందస్తు స్క్రీనింగ్, ఎఐ ఆధారిత గుర్తింపు, హ్యాండ్‌హెల్డ్ ఎక్స్‌రే పరికరాల వినియోగంతో కేసులను త్వరగా గుర్తించనున్నామని చెప్పారు. మొబైల్ మెడికల్ యూనిట్లు, నిక్షయ్ వాహనాలతో గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందిస్తమన్నామని చెప్పారు అదే విధంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వివిధ పరీక్షలు చేయడం, ‘నిక్షయ్ మిత్ర’ల ద్వారా పోషకాహార సహాయం అందించడం, అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో టీబీ నిర్మూలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

ప్రస్తుతం సీబీనాట్, ట్రూనాట్ వంటి ఆధునిక పరీక్షలతో వేగంగా టిబి నిర్ధారణ జరుగుతోందన్నారు. ‘నిక్షయ్’ పోర్టల్ ద్వారా ప్రతి రోగిని ట్రాక్ చేస్తూ, నిక్షయ్ పోషణ యోజన కింద పోషకాహార సహాయం అందిస్తున్నామని తెలిపారు. డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ టిబి రోగులను వివక్షకు గురిచేయకుండా మానసికంగా ప్రోత్సహించడంతో సమాజం కూడా నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యూనేజేషన్ అధికారి డాక్టర్ ప్రేమ్ చంద్, వైద్యాధికారులు, అసిస్టెంట్ సర్జన్ గోపాల కృష్ణ, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply