Announced2019 | జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ జోన్ కార్యకలాపాలు
Announced2019 | జూన్ 1 నుంచి సౌత్ కోస్ట్ జోన్ కార్యకలాపాలు
Announced2019 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక నెరవేరే దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ పరిధిలో విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి ఈ జోన్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.
గెజిట్ ప్రకారం గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే నుంచి కొన్ని ప్రాంతాలను విలీనం చేసి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేశారు. రాయగడ నుంచి కొన్ని సెక్షన్లను విశాఖ డివిజన్‌లో కలుపుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులతో పలాస-ఇచ్ఛాపురం, ఇచ్చాపురం-దువ్వాడ-విజయనగరం రైల్వే లైన్లు విశాఖ డివిజన్‌లో చేరాయి. అలాగే నౌపడా-పర్లాకిమిడి-బొబ్బిలి-సాలూరు లైన్లు, సింహాచలం-వడ్లపూడి-విశాఖ జగ్గయ్యపాలెం లైన్లు కూడా విలీనం చేశారు. కోరాపుట్-కిరండోల్ లైన్‌ను విశాఖ, రాయగడ డివిజన్లకు సంయుక్తంగా కేటాయించారు.
ఆరిలోవలో దక్షిణ కోస్తా రైల్వే శాశ్వత కార్యాలయ నిర్మాణం చేపట్టనుండగా, వీఎంఆర్‌డీఏ డెక్‌లో తాత్కాలికంగా జీఎం కార్యాలయం ఏర్పాటు చేశారు. జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 2019లో ప్రకటించిన ఈ జోన్‌కు 2025 జనవరిలో డీపీఆర్ ఆమోదం లభించగా, అదే నెలలో ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది.
ఇప్పటికే కీలక అధికారుల నియామకం పూర్తయింది. ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్, పర్సనల్, ఫైనాన్షియల్ అధికారులను నియమించారు. ఇతర డివిజన్ల నుంచి సుమారు 3వేల మంది విశాఖ జీఎం కార్యాలయంలో పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో 1200 మంది అవసరం ఉండగా, మొత్తం జోన్ పరిధిలో సుమారు 17 వేల మంది సిబ్బంది పనిచేయనున్నారు.
