Anniversaries | శ్రీ సాయి దివ్య క్షేత్రంలో వార్షికోత్సవాలు
Anniversaries | బాల్కొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గల శ్రీ సాయి దివ్య క్షేత్రంలో వసంత పంచమిని పురస్కరించుకొని 20వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ రోజు వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారు జామునుండే సాయిబాబాను దర్శించుకునేందుకు బారులుదీరారు.

ముందుగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు, సకల దేవతలకు విశేషా అభిషేకాలు, కుంకుమార్చన, దేవతామూర్తులకు మహాకల్ప అభిషేకాలు, పూర్ణాహుతిని నిర్వహించారు. బాల్యపల్లి సుబ్బారావు పంతులు ఆధ్వర్యంలో వైభవోపేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు తులాభారం నిర్వహించి భక్తులు తమ మొక్కులను చెల్లించుకున్నారు.

ఆలయ ప్రాంగణంలో నటరాజ నృత్య నికేతన్ వారి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. సాయంత్రం సాయిబాబా ఆలయం చుట్టూ రథోత్సవాన్ని నిర్వహించి ఊరి ప్రధాన విధుల గుండా రథంలో ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున రథోత్సవానికి మంగళహారతులతో స్వాగతం తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆలయాభివృద్ధి, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు. మండలంలోని చుట్టుపక్క గ్రామాల ప్రజలు సాయిబాబా దర్శించుకొని తీర్థ ప్రసాదలు స్వీకరించారు.
