రహదారి మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి..

గన్నవరం, ఆంధ్రప్రభ ; గన్నవరంలో జాతీయ రహదారి మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ గన్నవరం విమానాశ్రయం నుండి పశ్చిమ బైపాస్ వరకు మార్గంలో గల రహదారి మార్గాన్ని పరిశీలించారు.

జిల్లా కలెక్టర్ ఈరోజు గన్నవరం మండలంలోని కేసర పల్లి, గన్నవరం, చిన అవుటపల్లి గ్రామాల్లో పర్యటించి, రహదారి మార్గాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పారిశుధ్యం పనులు, డ్రైవ్ మోడ్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో రహదారి ఇరువైపులా పచ్చదనం పెంపొందించడంతో పాటు గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేయాలన్నారు.

మురికి కాలువలలో పూడికతీత పనులు చేపట్టి, మురుగు నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. పనులన్నీ విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట గుడివాడ డీఎల్పిఓ సంపత్ కుమారి, గన్నవరం తహసిల్దారు శివయ్య, ఎంపీడీవో మాధవి లత తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply