మత్స్యకార కుటుంబాలపై ఆర్థిక సంక్షోభం
మత్స్యకార కుటుంబాలపై ఆర్థిక సంక్షోభం
అమరావతి, ఆంధ్రప్రభ : ఒకప్పుడు ఉదయం వేళ తీర ప్రాంతాల్లో కనిపించే సందడి ఇప్పుడు తగ్గిపోయింది. సముద్రం నుంచి తిరిగి వచ్చే పడవలు, చేపల వేలంపాటలు, హార్బర్లలో పరుగులు తీసే కార్మికులు, ట్రాలర్ల రాకపోకలతో కళకళలాడే తీరప్రాంతాలు ఇప్పుడు నిశ్శబ్దాన్ని చాటుతున్నాయి. వరుస తుఫానులు, సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు, వాతావరణ హెచ్చరికలు, పెరిగిన డీజిల్ ధరలు కలిసి ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగాన్ని తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టేశాయి.
ఐసీఏఆర్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన వార్షిక నివేదిక-2025 ప్రకారం రాష్ట్రంలో సముద్ర చేపల దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. 2025లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 1.52 లక్షల టన్నుల చేపల దిగుబడులు మాత్రమే నమోదయ్యాయి. ఇది 2024తో పోలిస్తే 13 శాతం తగ్గుదల కాగా, 2023తో పోలిస్తే దాదాపు 20 శాతం క్షీణతగా నమోదైంది. 2023లో 1.9 లక్షల టన్నులు, 2024లో 1.75 లక్షల టన్నుల చేపల దిగుబడులు నమోదయ్యాయి. కానీ ఈసారి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ప్రభావం చూపడంతో మత్స్యరంగం ఆర్థికంగా కుదేలైంది.
తుఫాన్ల తాకిడితో నిలిచిపోయిన వేట
గత ఏడాది బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫానులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సముద్రం తీవ్ర ఆందోళనకర పరిస్థితులను ఎదుర్కొంది. వాతావరణ శాఖ తరచూ హెచ్చరికలు జారీ చేయడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు వెనుకంజ వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఐదు వారాలకు పైగా వేట పూర్తిగా నిలిచిపోయింది. అక్టోబర్ చివరిలో వచ్చిన మోంథా తుఫాను ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ అలలు, ఈదురుగాలులతో అనేక పడవలు సముద్రంలోకి వెళ్లలేక హార్బర్లకే పరిమితమయ్యాయి. వేటపై ఆధారపడే కుటుంబాలకు అప్పులు పెరిగిపోయాయి.
డీజిల్ ధరల మోతతో ట్రాలర్లకు బ్రేక్
మత్స్యరంగంలో ప్రధాన వ్యయం డీజిల్‌పైనే ఉంటుంది. అయితే పెరిగిన ఇంధన ధరలు ట్రాలర్ యజమానులకు భారీ భారంగా మారాయి. వేటకు వెళ్లి సరిపడా చేపలు దొరకకపోతే వచ్చిన ఆదాయం మొత్తం డీజిల్ ఖర్చులకే సరిపోతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇంకా ఐస్, వలలు, కార్మికుల కూలీలు, పడవల మరమ్మతులు, హార్బర్ ఛార్జీలు పెరగడంతో అనేక ట్రాలర్లు సముద్రంలోకి వెళ్లకుండా తీరానికే నిలిపివేయాల్సి వస్తోంది. కొన్ని హార్బర్లలో వందలాది పడవలు నిలిచిపోయిన దృశ్యాలు కనిపించాయి.
కాకినాడ హార్బర్లో క్షీణించిన దిగుబడులు
రాష్ట్రంలో చేపల దిగుబడుల్లో కాకినాడ హార్బర్ ఇప్పటికీ ప్రధాన కేంద్రంగా నిలిచింది. మొత్తం చేపల దిగుబడుల్లో 38 శాతం వాటా కాకినాడదే. విశాఖపట్నం 21 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. అయితే కాకినాడలో కూడా చేపల దిగుబడులు 19 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో రద్దీగా కనిపించే వేలంపాట కేంద్రాలు ఇప్పుడు నిర్జీవంగా మారుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
మెకనైజ్డ్ రంగం నిలకడ, మోటరైజ్డ్ రంగం క్షీణత
రాష్ట్రంలో మొత్తం పడవలలో 60 శాతం మెకనైజ్డ్ పడవలు ఉన్నాయి. 36 శాతం మోటరైజ్డ్, 4 శాతం నాన్-మోటరైజ్డ్ పడవలు ఉన్నాయి. మెకనైజ్డ్ రంగంలో మల్టీడే ట్రాల్ నెట్ వేట 0.89 లక్షల టన్నులతో ఆధిపత్యం కొనసాగించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 7 శాతం పెరుగుదల నమోదు చేసింది. అయితే మోటరైజ్డ్ రంగంలో క్యాచ్ రేట్లు 35 శాతం తగ్గాయి. మధ్యతరహా మత్స్యకారులు తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నారు. నాన్-మోటరైజ్డ్ రంగం 49 శాతం పెరుగుదల నమోదు చేయడం విశేషం. తక్కువ ఖర్చుతో సంప్రదాయ వేట పద్ధతులపై మత్స్యకారులు మళ్లీ దృష్టి పెడుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
అక్టోబర్-డిసెంబర్‌లో 10 శాతమే
త్రైమాసిక గణాంకాలు పరిస్థితి తీవ్రతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఏప్రిల్-జూన్‌లో 32 శాతం దిగుబడులు కాగా, జూలై-సెప్టెంబర్‌లో 32 శాతం, జనవరి-మార్చిలో 26 శాతం కాగా, అక్టోబర్-డిసెంబర్‌లో కేవలం 10 శాతం మాత్రమే నమోదయ్యాయి. తుఫానుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో చివరి త్రైమాసికంలో మత్స్యరంగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఐస్ ఫ్యాక్టరీలు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగం, చేపల మార్కెట్లు, ఎగుమతుల రంగం, డ్రై ఫిష్ తయారీ కేంద్రాలు, మహిళల ఉపాధి అన్నీ తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. తీరప్రాంత గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో చిన్న వ్యాపారులు, రోజువారీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డీజిల్ సబ్సిడీ పెంచాలని, తుఫాను సమయంలో ప్రత్యేక జీవన భృతి, చిన్న మత్స్యకారులకు బీమా రక్షణ, ఆధునిక భద్రతా పరికరాల పంపిణీ, హార్బర్ల ఆధునికీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సముద్ర వాతావరణ హెచ్చరికలపై వేగవంతమైన సమాచార వ్యవస్థ, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
భవిష్యత్తుపై పెరుగుతున్న ఆందోళన
వాతావరణ మార్పుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సముద్ర రంగంపై పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మత్స్యరంగం కూడా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. తుఫానుల తీవ్రత పెరగడం, సముద్ర ఉష్ణోగ్రతలు మారడం, చేపల వలసలు మారిపోవడం, కాలుష్యం పెరగడం కలిసి మత్స్యకారుల భవిష్యత్తుపై అనిశ్చితిని పెంచుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర వాతావరణ హెచ్చరికలు, ఇంధన సబ్సిడీలు, భద్రతా పరికరాలు, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే తీరప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
