ఏపీఎల్‌లో విజయవాడ జైత్రయాత్ర.. కాకినాడ థ్రిల్లింగ్ విక్టరీ
ప్రశాంత్–అబ్బాస్ విధ్వంసక బ్యాటింగ్
సన్‌షైనర్స్‌కు 19 పరుగుల విజయం
ప్రణవ్ రెడ్డి నాలుగు వికెట్లతో రాయలసీమను కట్టడి
లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో తుంగభద్రపై కాకినాడ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
ప్రశాంత్, హరిశంకర్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు
(ఆంధ్రప్రభ, విజయవాడ): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 సీజన్-5లో మంగళగిరి ఏసీఏ స్టేడియం వేదికగా గురువారం జరిగిన రెండు మ్యాచ్‌లు అభిమానులకు ఉత్కంఠభరిత వినోదాన్ని అందించాయి. తొలి మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్ 19 పరుగుల తేడాతో రాయల్ షాప్ రాయలసీమపై ఘన విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో లో స్కోరింగ్ థ్రిల్లర్‌గా సాగిన పోరులో కాకినాడ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో తుంగభద్ర వారియర్స్‌ను ఓడించింది.
విజయవాడ విజయం…
తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్‌షైనర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. డి.బి. ప్రశాంత్ 33 బంతుల్లో 60 పరుగులు (5 ఫోర్లు, 2 సిక్సర్లు), షేక్ జహీర్ అబ్బాస్ 20 బంతుల్లోనే 53 పరుగులు (1 ఫోర్, 7 సిక్సర్లు) చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేశారు. రాయలసీమ బౌలర్లలో సాకేత్ రామ్ రెండు వికెట్లు తీశాడు.
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జట్టు ఆరంభంలోనే తడబడింది. తేజా రెడ్డి 44, వంశీకృష్ణ 37 పరుగులతో పోరాడినా, మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులకే పరిమితమైంది. విజయవాడ బౌలర్ ప్రణవ్ రెడ్డి నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించగా, డి.బి. ప్రశాంత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఒత్తిడిలో తుంగభద్ర…
రెండో మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తుంగభద్ర వారియర్స్ పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. సౌరబ్ కుమార్ 33, సాత్విక్ 31 పరుగులతో జట్టును ఆదుకున్నప్పటికీ 19.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. కాకినాడ బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, ఆంజనేయులు, సాయి తేజ చెరో రెండు వికెట్లు తీశారు.
159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. మధ్యలో వరుస వికెట్లు పడటంతో మ్యాచ్ ఉత్కంఠగా మారినా, అభిషేక్ రెడ్డి 50, అర్జున్ టెండూల్కర్ 34 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు. కాకినాడ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తుంగభద్ర బౌలర్లలో ఐదుగురు తలో వికెట్ సాధించారు. మూడు వికెట్లతో రాణించిన హరిశంకర్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
