డాక్టర్ ప్రియాంక కుటుంబానికి సంపత్ కుమార్ అండ

  • పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు బాధ్యత తీసుకున్న మాజీ ఎమ్మెల్యే

ఎర్రవల్లి, ఆంధ్రప్రభ: రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక కుటుంబానికి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్‌.ఏ. సంపత్ కుమార్ అండగా నిలిచారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ నుంచి స్వగ్రామానికి తరలింపు, అంత్యక్రియల వరకు కుటుంబానికి తోడుగా నిలిచారు.

గతవారం జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబానికి అండగా నిలిచిన సంపత్ కుమార్.. సోమవారం ఐజ పట్టణంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి టీజీ భరత్.. డాక్టర్ ప్రియాంక కుటుంబ సభ్యులకు రూ.20 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును సంపత్ కుమార్ సమక్షంలో అందజేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అనంతరం డాక్టర్ ప్రియాంక పార్థివదేహానికి సంపత్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి, కౌన్సిలర్ షేక్‌షావలి ఆచారి, అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, ఐజ మండల అధ్యక్షుడు జయన్న, డీసీసీ కార్యదర్శి సంకపురం రాముడు, దేవరాజు, ఇస్మాయిల్, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.